మే 20న‌ రాళ్ల‌ప‌ల్లి అంతిమ‌యాత్ర‌

Update: 2019-05-18 04:47 GMT
సీనియ‌ర్ న‌టుడు .. క్లాసిక్ క‌మెడియ‌న్ రాళ్ల‌ప‌ల్లి (70) మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మాదాపూర్ మాక్స్ క్యూర్ హాస్పిటల్ నుండి పంజాగుట్ట నిమ్స్ కు అంబులెన్స్ లో రాళ్ళపల్లి పార్థీవ దేహాన్ని త‌ర‌లించారు. విదేశాల్లో ఉన్న కూతురు, అల్లుడు వచ్చేవరకు నిమ్స్ లొనే రాళ్ళపల్లి బౌతిక‌ఖాయాన్ని ఉంచ‌నున్నారు.
ఈనెల 20వ తారీకు ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు ప్ర‌క‌టించారు.

రాళ్ళపల్లి మృతికి మూవీ ఆర్టిస్టుల సంఘం స‌హా మెగాస్టార్ చిరంజీవి .. నిర్మాత కె.ఎస్ రామారావు సంతాపం తెలియ‌జేశారు. ప‌లువురు ఆర్టిస్టులు రాళ్ల‌ప‌ల్లి మృతి దిగ్భ్రాంతి క‌లిగించింద‌ని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ-``చెన్నైలోని వాణి మహల్ లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. `ఎలా ఉన్నావు మిత్రమా?` అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను`` అన్నారు.

మా అభిలాష లో ఎంతో మంచి పాత్ర‌లో న‌టించిన రాళ్ళపల్లి గారు మంచి నటుడు.. గొప్ప‌ వ్యక్తి. ఆయన లేకపోవడం పరిశ్రమకి తీరని లోటు. రాళ్ళపల్లి గారి  ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని అభిలాష నిర్మాత‌.. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె ఎస్ రామారావు అన్నారు. ఆర్టిస్టుల సంఘంలోని ప‌లువురు న‌టీన‌టులు రాళ్ల‌ప‌ల్లితో త‌మ అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయ‌న మంచిత‌నం గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు ముచ్చ‌ట్ల‌లో క‌నిపిస్తున్నాయి.


Tags:    

Similar News