'ఆచార్య'కు టాటా చెప్పిన కామ్రేడ్‌ 'సిద్ధ'..!

Update: 2021-03-05 11:34 GMT
మెగాస్టార్‌ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కతున్న ''ఆచార్య'' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కామ్రేడ్‌ ‘సిద్ధ’గా చరణ్ కనిపించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా - మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిపారు. అక్కడ చిరంజీవి - చరణ్‌ లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భుజంపై తండ్రి చేయి వేసిన పిక్ ఒకటి షేర్ చేసిన చరణ్.. ‘ఇది కామ్రేడ్‌ సమయం! ఆచార్య సెట్‌ లో నాన్న(చిరంజీవి), కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో చరణ్ 'ఆచార్య' కోసం తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసాడని తెలుస్తోంది.

మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో తన తండ్రి చిరంజీవితో కలిసి 20 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పాల్గొన్న రామ్ చరణ్.. తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికిందని తెలుస్తోంది. సతీమణి ఉపాసనతో కలిసి చరణ్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారని తెలుసుకున్న అభిమానులు ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే తండ్రీకొడుకులు చిరు - చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్‌ కిచ్లు నటిస్తుండగా.. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోందని సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్స్‌ - కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'ఆచార్య' సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags:    

Similar News