గురుశిష్యులకు ఎన్టీఆర్ సవాల్

Update: 2017-10-12 04:58 GMT
ఒక కథను ఒక రకంగానే ఎందుకు చెప్పాలి. కథ చెప్పడంలో ఎవడి స్టయిల్ వాళ్లది. విలన్ కోణం నుంచి కథ చెబితే ఒకలా ఉంటుంది. హీరో కోణం నుంచి చెబితే ఇంకోలా ఉంటుంది. అసలేదేం లేకుండా చిలవలు పలవలు పేర్చి తోచిందల్లా చెబితే మరోలా ఉంటుంది. మామూలు కథలకైతే ఇదంతా ఓకే. మరి అందరికీ తెలిసిన కథ అయితే. దానినే ఆకట్టుకునేలా చెప్పాల్సి వస్తే.. ఇప్పుడు గురుశిష్యులిద్దరికి ఇదే పరిస్థితి ఎదురైంది.

తెలుగు నటుల్లో యుగపురుషుడైన ఎన్టీఆర్ జీవిత గాథతో ఒకే టైంలో రెండు సినిమాలు తీయడానికి రంగం సిద్ధమవుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించాడు. దానికి సంబంధించి వివరాలు సేకరించే పని మొదలెట్టేశాడు. ఇదే టైంలో తన తండ్రి జీవిత గాథను సినిమాగా తీయడానికి బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. దీనికి డైరెక్టర్ గా నేనే రాజు నేనే మంత్రితో పొలిటికల్ మూవీ బాగా తీయగలడని గుర్తింపు తెచ్చుకున్న తేజను రంగంలోకి దింపుతున్నారు.

తేజ గతంలో రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన వాడే. ఇప్పుడు ఆర్.జి.వి. తీస్తున్న కథనే కొత్త కోణంలో చూపించాల్సి ఉంటుంది. ఆర్.జి.వి. ఒక పక్క ఫ్లాపులతో కిందమీద పడుతుంటే.. నిన్న - మొన్నటిదాకా అదే విధంగా ఇబ్బంది పడ్డ తేజ ఇప్పుడు ఫాంలోకి వచ్చేశానని అంటున్నాడు. మరి చూద్దాం.. ఇద్దరిలో కథ ఎవరు బాగా చెబుతారో?
Tags:    

Similar News