రామ్ కొత్త సినిమా టైటిల్ మారింది

Update: 2015-11-10 07:43 GMT
యువ కథానాయకుడు రామ్ ‘హరి కథ’ పేరుతో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా టైటిల్ మార్చేశారు. కొత్తగా ‘నేను శైలజ’ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాదు.. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. 2016 జనవరి 1న ‘నేను శైలజ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే నిర్మిస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థలో ఇంతకుముందు కొన్ని సినిమాలకు రచయితగా పని చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమా దర్శకుడు. మలయాళం, తమిళ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో తెలుగులోకి అడుగుపెడుతోంది.

వరుస ఫ్లాపుల తర్వాత ఈ ఏడాది ‘పండగ చేస్కో’తో ఫామ్ లోకి వచ్చిన రామ్.. తన సొంత బేనర్ లో ఈ మధ్య చేసిన ‘శివమ్’ తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో తన తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు రామ్. ముందు అనుకున్న స్క్రిప్టులో కొన్ని మార్పులు కూడా చేసి.. పకడ్బందీగా సినిమాను తీర్చిదిద్దుతున్నారట. రామ్ చాన్నాళ్ల తర్వాత చేస్తున్న పక్కా లవ్ స్టోరీ ఇదని సమాచారం. ఈ ఏడాది జనవరి 1న స్రవంతి బేనర్ లో వచ్చిన డబ్బింగ్ మూవీ ‘రఘువరన్ బీటెక్’ సూపర్ హిట్టయింది. ఆ సెంటిమెంటుతోనో ఏమో.. వచ్చే ఏడాది తొలి రోజు ‘నేను శైలజ’ విడుదల చేయబోతున్నారు. ‘శివమ్’ తర్వాత రామ్ సినిమాకు మరోసారి సంగీతాన్నందిస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్.
Tags:    

Similar News