రామారావు ఎక్కడా కనిపించడం లేదేంటి..??

Update: 2022-07-13 12:30 GMT
'క్రాక్' తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలైతే పూర్తి చేస్తున్నాడు కానీ.. ప్రమోషన్స్ లో మాత్రం పెద్దగా పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతోంది.  

రవితేజ చేసిన 'ఖిలాడీ' సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు హీరో తగినంత సమయం ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

దీనికి తగ్గట్టుగానే చివరి నిమిషంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు వచ్చాడే తప్పితే.. 'ఖిలాడి' చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు లేటెస్టుగా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఎట్టకేలకు జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శరత్ మండవ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. జులై 16న ట్రైలర్ ను లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. మరోవైపు దర్శకుడు శరత్ తో పాటుగా హీరోయిన్లు రజిషా విజయన్ మరియు దివ్యాంశ కౌశిక్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.

కొంత విరామం తర్వాత వెండితెరపైకి తిరిగి వస్తున్న వేణు తొట్టెంపూడి కూడా సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. దాదాపు అన్ని తెలుగు టాక్ షోలలో పాల్గొనడంతో పాటుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ హీరో రవితేజ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించిన నేపథ్యంలో.. అగ్రిసివ్ గా ప్రమోట్ చేసినా ఆశించిన ఓపెనింగ్స్ రావడం లేదు. ఇంక ప్రమోషన్స్ చేయని చిత్రాల పరిస్థితి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందుకే జనాల దృష్టిని ఆకర్షించడానికి విడుదలకు నెల రోజుల ముందు నుంచే ప్రచార కార్యక్రమాలతో హంగామా చేస్తున్నారు. ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లోనూ సందడి చేస్తున్నారు. కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రిలీజ్ కు కేవలం రెండు వారాలే ఉంది. అయినప్పటికీ రవితేజ ఎందుకు ప్రమోషన్స్ లో దిగడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.

ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ వరకూ అగ్రిసివ్ గా ప్రమోట్ చేయాల్సిన అవసరముంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.. మరి రానున్న రోజుల్లో అయినా రవితేజ ప్రమోషన్స్ కోసం డ్యూటీ ఎక్కుతాదేమో చూడాలి.
Tags:    

Similar News