రమేష్ బాబును వెంటాడిన బ్యాడ్ లక్

Update: 2022-01-09 05:30 GMT
సూపర్ స్టార్ క్రిష్ణ తొలి సినిమాతోనే హీరోగా గెలిచేశాడు. ఆయన మూడవ సినిమాగా వచ్చిన గూఢచారి 116 బ్లాక్ బస్టర్ అయింది. నాటి నుంచి క్రిష్ణకు తిరుగులేకుండా పోయింది. ఇక క్రిష్ణకు అచ్చి వచ్చిన అదృష్టం ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబుకు ఏ మాత్రం కలసిరాలేదు. అందుకే ఆయన కెరీర్ అలా పైకి లేచినట్లు అనిపించినా పాతాళం అంచులను చూసింది.

నిజానికి సూపర్ స్టార్ కి అచ్చమైన నట వారసుడు రమేష్ బాబు అనే చెప్పాలి. క్రిష్ణ ఫీచర్స్ అన్నీ నూటికి నూరు పాళ్ళూ రమేష్ బాబు పుణికిపుచ్చుకుని అందగాడుగా వెండితెర అరంగ్రేట్రం చేశాడు. ఫస్ట్ మూవీ సామ్రాట్ 1987లో రిలీజ్ అయింది. ఈ మూవీని క్రిష్ణ సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ బ్యానర్ మీద  భారీ బడ్జెట్ తో  తీశారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా నాటి సీనియర్ డైరెక్టర్ వి మధుసూదనరావుని తీసుకున్నారు.

ఆయన అప్పటికే చాలా కాలంగా హిట్లు లేక ఉన్న మధుసూదనరావు డైరెక్షన్ లో సినిమా చేయడమే మైనస్ అన్న విమర్శలు నాడు వినిపించాయి. ఆ సినిమా హిందీ బేతాబ్ కి రీమేక్. భారీ కాస్టింగ్ తో సినిమా స్టార్ట్ అయింది.  బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ రమేష్ బాబు పక్కన పెయిర్ గా చేసింది. ఆమె ఫస్ట్ మూవీ కూడా ఇదే.  ఇక ఈ సినిమాకు బప్పీలహరి మ్యూజిక్,  రాజ్ సీతారామ్ సాంగ్స్ అప్పట్లో మోత మోగించాయి.

సామ్రాట్ కి  అప్పట్లోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో పాటు ఫస్ట్ సినిమాతోనే  రమేష్ బాబు బాగా రాణించాడు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఆ సినిమా తరువాత చూస్తే రమేష్ బాబు సరైన సబ్జెక్టులు ఎంచుకోలేకపోయారు. స్టార్ డైరెక్టర్లతో వరస సినిమాలు పడలేదు. అయితే రమేష్ బాబుకు మాస్ హిట్ ని  ఆ రోజుల్లోనే  ఏ కోదండరామిరెడ్డి ఇచ్చాడు. అలా బజార్ రౌడీ సూపర్ హిట్ అయింది. అయితే దాన్ని కూడా కంటిన్యూ చేయడంలో రమేష్ బాబు తడబడ్డాడు అనే చెప్పాలి.

ఇక క్రిష్ణ కూడా రమేష్ బాబు కెరీర్ గురించి మాట్లాడుతూ హీరోగా ఫెయిల్ కావడం వెనక తన తప్పు కూడా ఉందని చెప్పారు. తాను పూర్తి స్థాయిలో రమేష్ బాబు కెరీర్ మీద దృష్టి పెట్టలేకపోయాను అని ఆయన ఒక సందర్భంలో  చెప్పుకున్నారు. ఇక రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన టైమ్ తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు గట్టిగా ఉన్నారు. ఇంకో వైపు నందమూరి బాలక్రిష్ణ ఉన్నారు. కొత్తగా అపుడే నాగార్జున, వెంకటేష్ హీరోలుగా  వచ్చారు.

దాంతో టాలీవుడ్ లో హెవీ కాంపిటేషన్ ఉంది. అదే టైమ్ లో రమేష్ బాబు క్రిష్ణను నటనలో పూర్తిగా అనుకరించడం, సొంత స్టైల్ ని అలవరచుకోకపోవడం కూడా మైనస్ అయ్యాయని చెబుతారు. బాలనటుడిగా సక్సెస్ అయిన రమేష్ బాబు హీరోగా ఫెయిల్ కావడానికి ఈ ఇమిటేషన్ కూడా ప్రధాన కారణం అంటారు.

రమేష్ బాబు తో బాలనటుడిగా  నీడ మూవీని తీసిన దాసరి నారాయణరావు టాప్ హీరో అవుతాడని దీవించారు. అయితే హీరోగా మాత్రం రమేష్ బాబు అనుకున్నంతగా వెలగలేకపోవడానికి ఆయన నటనలో తనకంటూ ప్రత్యేకతను చూపించుకోలేకపోవడమే అంటారు. సూపర్ స్టార్ క్రిష్ణ బ్యాక్ బోన్ గా ఉన్నా కూడా రమేష్ బాబు దూకుడు చేయలేకపోయారు.

దీంతో అన్నీ ఉన్నా కూడా ఆయన హీరోగా వెనకడుగే వేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో చిత్రం చెప్పుకోవాలి. రమేష్ బాబు తో తీసిన ఎన్నో సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. అందులో భారీ సినిమాలు సైతం ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి రిలీజ్ అయినా ఆయన కెరీర్ ఊపందుకుందే అని చెప్పాలి. మొత్తానికి బ్యాడ్ లక్ అని కూడా అనవచ్చేమో.

రమేష్ బాబుతో ఆ రోజుల్లో ప్రేమ చరిత్ర మూవీని  బ్లాక్ బస్టర్ హిట్  ప్రేమ సాగరం ఫేమ్ టీ రాజేందర్ స్టార్ట్ చేసి మధ్యలో  వదిలేశారు. అలాగే సాహసయాత్ర అని మరో భారీ చిత్రం కూడా మధ్యలోనే ఆగింది. జానపద చిత్రాలు కూడా కొన్ని రమేష్ బాబు తో మొదలెట్టి ఆపేశారు. మొత్తానికి ఈ గందరగోళం మధ్యనే రమేష్ బాబు పూర్తిగా విసిగి సినిమాకో దండం అనేశారు. ఆయన ఎంత విసిగిపోయారూ అంటే తన తమ్ముడు మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఎక్కడా సినిమా ఫంక్షన్లలో కనిపించనంతగా. మొత్తానికి రమేష్ బాబు బాల నటుడిగా సక్సెస్ అయ్యారు, హీరోగానే ఇబ్బంది పడ్డారు అని అనుకోవాలి.
Tags:    

Similar News