న‌టుడిగా నిర్మాత‌గా ర‌మేష్ బాబు జర్నీ

Update: 2022-01-09 04:44 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా సినీఆరంగేట్రం చేసిన ర‌మేష్ బాబు స్టార్ హీరోగా రాణించాల‌ని చాలా ప్ర‌య‌త్నించారు. తండ్రితో క‌లిసి సినిమాల్లో న‌టించారు. అలాగే కృష్ణ సొంత బ్యాన‌ర్ లో హీరోగా న‌టించి హిట్లు కొట్టారు. కానీ స్టార్ డ‌మ్ ప‌రంగా ఆశించిన స్థాయికి ఎద‌గ‌క‌పోవ‌డంతో రూట్ మార్చి నిర్మాత‌గానూ ప్ర‌య‌త్నించారు. అయితే ఈ రంగంలో పెనుపోక‌డ‌లు పెరిగిన బ‌డ్జెట్లు వ‌గైరా స‌న్నివేశంతో ర‌మేష్ బాబు లాంటి నెమ్మ‌ద‌స్తుడు స్వ‌యం ముద్ర‌తో ఎద‌గ‌లేక‌పోయార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

న‌టుడిగా కెరీర్ ని ప‌రిశీలిస్తే.. ర‌మేష్ బాబు బాల న‌టుడిగా త‌న సినీ కెరీర్ ప్రారంభించారు.  అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలో యువ అల్లూరి సీతారామ‌రాజుగా న‌ట‌న‌కు ఓన‌మాలు దిద్దారు ర‌మేష్ బాబు. 1974లో అంటే 18 వయసులో రమేష్ న‌ట‌న‌లో ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత హీరో అయ్యారు. అల్లూరి సీతారామరాజు - దొంగ‌ల‌కు దొంగ‌- మ‌నుషులు చేసిన దొంగ‌లు- అన్న‌ద‌మ్ముల స‌వాల్- నీడ‌- పాలు నీళ్లు చిత్రాల్లో న‌టించారు. అటుపై 1987లో సామ్రాట్ చిత్రంతో హీరోగా పరిచ‌యమ‌య్యారు. చిన్ని కృష్ణుడు- బ‌జార్ రౌడీ- క‌లియుగ కృష్ణుడు- ముగ్గురు కొడుకులు- బ్లాక్ టైగ‌ర్‌- కృష్ణ‌గారి అబ్బాయి- ఆయుధం- క‌లియుగ అభిమన్యుడు- శాంతి ఎన‌తు శాంతి- నా ఇల్లే నా స్వ‌ర్గం- మామ కోడలు- అన్నా చెల్లెలు- ప‌చ్చ తోర‌ణం- ఎన్ కౌంట‌ర్ చిత్రాలతో మెప్పించారు.

ఎన్‌కౌంటర్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో క‌లిసి ర‌మేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు. శాంతి ఎన‌తు శాంతి అనే త‌మిళ చిత్రంలో ఆయ‌న న‌టించ‌గా ఇందులో శింబు బాల‌న‌టుడిగా క‌నిపించారు. అటుపై హీరోగా ఆశించిన విజ‌యాలు ద‌క్క‌క‌పోవ‌డంతో న‌ట‌న‌ను విర‌మించారు.

నిర్మాత‌గా కెరీర్ ని ప‌రిశీలిస్తే.. సూప‌ర్ స్టార్ కృష్ణ సొంత బ్యాన‌ర్ ప‌ద్మాల‌యా స్టూడియోస్ లో చేసిన సూర్య‌వంశం హిందీ రీమేక్ కు ర‌మేష్ బాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా కొన‌సాగారు. మ‌హేష్ బాబు హీరోగా అర్జున్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి ర‌మేష్ బాబు నిర్మాత‌. ఆ త‌ర్వాత అతిథి లాంటి ఫ్లాప్ సినిమాని నిర్మించారు. అటుపై మ‌హేష్- శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో దూకుడు- ఆగ‌డు వంటి చిత్రాల్ని నిర్మించారు. వీటిలో దూకుడు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించగా ఆగ‌డు డిజాస్ట‌రైంది. నిజానికి ర‌మేష్ బాబు స్వ‌భావం ప‌రంగా గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచానికి దూరంగా ఉండేందుకే ఇష్ట‌ప‌డేవారు. పబ్లిక్ ఫంక్ష‌న్ల‌కు ఆయ‌న పెద్ద‌గా ఆసక్తిని క‌న‌బ‌రిచేవారు కాదు. మ‌హేష్ కి సంబందించిన ఈవెంట్ల‌లో ఆయ‌న ఏనాడూ క‌నిపించిందే లేదు. అయితే మ‌హేష్ త‌న అన్న‌ను ఎలాగైనా నిర్మాత‌గా నిల‌బెట్టేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందించారు. కానీ ఈ రంగంలో ఒడిదుడుకుల వ‌ల్ల ర‌మేష్ బాబు నిర్మాత‌గానూ కొన‌సాగ‌లేదు.
Tags:    

Similar News