సాక్ష్యం’ టీంది భయమా.. స్ట్రాటజీనా?

Update: 2018-07-27 04:35 GMT
ఈ రోజుల్లో తెలుగు సినిమాలకు యుఎస్ మార్కెట్ అనేది ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. మంచి కంటెంట్‌ తో సినిమా తీయాలే కానీ.. చిన్న-మీడియం రేంజి సినిమాల సినిమాల బడ్జెట్ లో చాలా వరకు అమెరికాలోనే వసూలైపోతుంది. స్టార్ హీరోల సినిమాలకు అక్కడి హక్కులు భారీ రేట్లు పలుకుతున్నాయి. ఐతే యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టు లోకల్ ప్రేక్షకులతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్లు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ఎక్కువగా ఇష్టపడతారు. మాస్ మసాలా సినిమాలు అక్కడ వర్కవుట్ కావు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. మాస్ సినిమాలకు అక్కడ ఆదరణ తక్కువే. ఈ నేపథ్యంలోనే ‘సాక్ష్యం’ టీం యుఎస్‌ లో ప్రిమియర్లు క్యాన్సిల్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఐతే ఇందులో కొంచెం భయం.. కొంచెం స్ట్రాటజీ కూడా కనిపిస్తోంది. ఊరికే అత్యాశకు పోయి ప్రిమియర్లు వేస్తే.. ఆశించిన రెస్పాన్స్ రాకుంటే కష్టం. ప్రిమియర్ కలెక్షన్లు తక్కువగా వస్తే దాని మీద నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అలాగే మాస్ సినిమా కాబట్టి అక్కడ టాక్ ఎలా వస్తుందో చెప్పలేం. ప్రిమియర్లకు టాక్ అటు ఇటుగా వస్తే సోషల్ మీడియాలో దాని మీద చర్చ జరుగుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ప్రభావం చూపొచ్చు. ప్రిమియర్లకు టికెట్ల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌ అంత ఇమేజ్ ఉన్న హీరో కాదు కాబట్టి.. అతడి కోసం అంత రేట్లు పెట్టడానికి అక్కడి ప్రేక్షకులు ముందుకు రాకపోవచ్చు. కాబట్టి ప్రిమియర్ల వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే వాటిని క్యాన్సిల్ చేసుకుని నేరుగా శుక్రవారమే డైరెక్ట్ షోలు వేసేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    

Similar News