మహాభారతం కాదంటూనే ఆ పాత్రలపై ఆర్జీవీ వెబ్ సిరీస్.. పోస్టర్ విడుదల!!

Update: 2021-01-18 14:53 GMT
వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ రూపంలో మరో వివాదానికి తెరలేపాడు. రాంగోపాల్ వర్మ సినిమాల గురించి, ఆయన మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు రొమాన్స్ జానర్ ను పట్టుకొని వేలాడిన వర్మ.. ఇప్పుడు మళ్లీ తన పంథా మార్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ఏది చేసిన వివాదాస్పద అంశాలను లేవనెత్తడం మాత్రం మానలేదు. తాజాగా 'ఇది మహాభారతం కాదు' అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు పోస్టర్ వీడియో విడుదల చేసి ప్రకటించాడు. అయితే ఏంలేదనుకున్నా వర్మ ఇది మహాభారతం కాదు అనే టైటిల్ తోనే ఆసక్తి కలిగించాడనే చెప్పాలి. ప్రస్తుతం 'ఇది మహాభారతం కాదు' అనే ప్రకటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కానీ వర్మకు నిత్యం సోషల్ మీడియా వార్తలలో తన పేరు వినిపించకపోతే మాత్రం ఏమి తోచదని అర్థమయ్యేలా చేస్తున్నాడు. 'ఇది మహాభారతం కాదు' అనే డిఫరెంట్ వెబ్ సిరీస్ టైటిల్ లుక్ తో పాటు ఆడియో పోస్టర్ రిలీజ్ చేసాడు.
ఇక టైటిల్ పోస్టర్‌ పై ''గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్'' అని రాయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక పోస్టర్ ఆడియోలో వర్మ మాట్లాడుతూ.. 'మహాభరతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని, దీని ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ప్రకటన చూస్తే వర్మ పిచ్చి పీక్స్ లోకి వెళ్లిందని అర్ధమవుతుంది. ఈ ఆడియోలో వర్మ.. మనుషులు చేసే అన్ని అరాచకాలను పూసగుచ్చినట్లుగా వరుసగా బయటపెట్టడం చర్చలకు దారితీస్తుంది. అయితే ఆడియో ఇప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఇక చివరిగా చెవులు తెరిచి క్లియర్ గా వినండి.. ఇది మహాభారతం కాదు! అంటూ ఎండింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కానీ మహాభారతంలో ఉన్న పాత్రలన్ని ఉంటాయన్నాడు. ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక సిరాశ్రీ రచించిన ఈ స్క్రిప్ట్ కి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్జీవీ పర్యవేక్షణలో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది.


Tags:    

Similar News