తండ్రి కడసారి చూపుకు నోచుకోని రిషి కపూర్‌ కూతురు

Update: 2020-04-30 15:30 GMT
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని చందన్‌ వాడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. లాక్‌ డౌన్ నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండా నిరాడంబరంగా లెజెండరీ నటుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిషీ కుమార్తె రిధిమా కపూర్‌ రాకముందే అంత్యక్రియలు ముగించారు. రిషి కపూర్ పార్థీవదేహాన్ని హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌ లో శ్మశాన వాటికకు తీసకొచ్చి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరిపారు. రణ్‌ బీర్ కపూర్ తన తండ్రికి తలకొరివి పెట్టారు. నిబంధనల ప్రకారం కేవలం 20 మంది కుటుంబ సభ్యులు - సన్నిహితుల మధ్య రిషీ కపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడు రణబీర్‌ కపూర్‌ - భార్య నీతూకపూర్‌ - సోదరి రీమా జైన్‌ - మనోజ్‌ జైన్‌ - ఆర్మాన్‌ - నటులు సైఫ్‌ అలీఖాన్‌ - అభిషేక్‌ బచ్చన్‌ - కరీనా కపూర్‌ - అలియా భట్‌ - అనిల్‌ అంబానీ - ఆయాన్‌ ముఖర్జీ వంటి కొద్దిమందిని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించారు. రిషి కపూర్ కుమార్తె రిధిమా కపూర్ సహ్ని అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె లాక్‌ డౌన్ కారణంగా సమయానికి రాలేకపోయారు. పోలీసులను ప్రత్యేక అనుమతి తీసుకున్న రిధిమా కారులో ఢిల్లీ నుంచి బయలుదేరారు.  ఆమె రేపు ముంబై చేరుకుంటారు. కానీ ఆమె తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయింది.

రిషి కపూర్‌ ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. రిషీ కపూర్ మరణంపై బాలీవుడ్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. న్యూయార్క్‌ లో కాన్సర్‌ చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థకు గురవడంతో రెండు రోజుల క్రితమే రిషి కపూర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


Tags:    

Similar News