ఒక అమ్మకి పుడితే ఆ హెడ్డింగ్స్ పెట్ట‌రు: ఆర్పీ

Update: 2018-03-10 07:11 GMT
ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో సోష‌ల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ - ఉచిత మొబైల్ డేటాలు త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి రావ‌డంతో యూట్యూబ్ ను వీక్షించేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో, ఇబ్బ‌డిముబ్బ‌డిగా యూట్యూబ్ చానెళ్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని యూట్యూబ్ చానెళ్లు త‌న రేటింగ్స్ కోసం క్యాచీ హెడింగ్స్ పెడుతుంటాయి. అయితే, తాజాగా అటువంటి యూట్యూబ్ చానెళ్ల‌పై సంగీత ద‌ర్శ‌కుడు - ద‌ర్శ‌కుడు - న‌టుడు ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం త‌మ రేటింగ్స్ కోసం ఇంత‌గా దిగ‌జారిపోయే యూట్యూబ్ చానెల్స్ నిర్వాహ‌కుల‌పై ఆర్పీ మండిప‌డ్డారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొంత‌మంది యూట్యూబ్ చానెళ్ల నిర్వాహ‌కులు .......ఆ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తున్న మ‌హిళా యాంక‌ర్ ను - త‌న‌ను ఉద్దేశించి కూడా అస‌భ్య‌క‌రంగా ఉండే క్యాచీ హెడ్డింగ్స్ పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ఆర్పీ అన్నారు. ఆ యాంక‌ర్ స్థానంలో త‌మ త‌ల్లో - చెల్లో ఉంటే....అలాగే హెడ్డింగ్స్ పెడ‌తారా అని ఆర్పీ ఆవేశ‌పూరితంగా ప్ర‌శ్నించారు. ఆ మ‌హిళ కూడా ఒక‌రికి చెల్లో - భార్యో - త‌ల్లో అయి ఉంటుంద‌ని, వేరే మ‌హిళ అయినంత మాత్రాన కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేయ‌డం సరికాద‌న్నారు. కేవలం త‌మ రేటింగ్స్ పెంచుకోవ‌డం కోసం - లైక్ లు - షేర్ లు - స‌బ్ స్క్రిప్ష‌న్ల కోసం అంత నీచంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏమిట‌ని ఆర్పీ ప్ర‌శ్నించారు. తాను సాధార‌ణంగా బూతులు మాట్లాడ‌న‌ని, కానీ యూట్యూబ్ చానెల్స్ విష‌యంలో మాట్లాడినా త‌ప్పులేదని అన్నారు. నిజంగా ఒక అమ్మ‌కి పుట్టి ఉంటే అటువంటి కించ‌ప‌రిచే హెడ్డింగ్స్ పెట్ట‌డం మానుకోవాల‌ని కొన్ని యూట్యూబ్ చానెళ్ల నిర్వాహ‌కులకు గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని ఆర్పీ ఆవేశ‌పూరితంగా చెప్పారు.



Tags:    

Similar News