రీ-రిలీజ్ కు రెడీ అయిన RRR..!

Update: 2022-06-01 09:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన  సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. మార్చి 25న విడుదలైన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద RRR మూవీ $14.5 మిలియన్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం అమెరికాలో గ్రాండ్ గా రీ-రిలీజ్‌ కు సిద్ధమైంది. ట్రిపుల్ ఆర్ అన్‌ కట్ వెర్షన్ ను ఈరోజు (జూన్ 1) ప్రదర్శించబోతున్నారు.

యూఎస్ఏ అంతటా 100 విభిన్న స్క్రీన్‌లలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు. ఒక భారతీయ సినిమా అమెరికాలో ఇన్ని స్క్రీన్ లలో రీ రిలీజ్ కావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే RRR ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్‌ స్క్రీనింగ్ పేరుతో తొలగించిన కొన్ని సన్నివేశాలను ఈ అన్‌ కట్‌ వెర్షన్‌ లో యథాతథంగా ఉంచి ప్రేక్షకులకు చూపించబోతున్నారు.  

ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం ఇటీవలే డిజిటల్ రిలీజ్ చేయబడింది. జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్సన్స్ స్ట్రీమింగ్ అవుతుండగా.. నెట్‌ ప్లిక్స్‌ లో మాత్రం ఈ సినిమా హిందీ వెర్షన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన RRR.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే హవా చూపిస్తోంది. తాజాగా ఓటీటీలో మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నెట్‌ ఫ్లిక్స్‌ లో నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఈ మల్టీస్టారర్ మూవీ టాప్ 10లో కొనసాగుతోంది. మే 23 నుంచి మే 29 వరకు ఈ సినిమాకు 18 మిలియన్ అవర్స్ వీక్షణలు వచ్చినట్లు అఫీషియల్‌ గా ప్రకటించారు.

జీ5ఓటీటీలోనూ RRR చిత్రానికి అద్భుతమైన రెస్సాన్స్ వస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్‌ కు 1000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సంచలనం రేపింది.

థియేటర్స్ మరియు ఓటీటీలలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు యూఎస్ఏలో మరోసారి బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవడం విశేషం. కాగా, విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో RRR చిత్రాన్ని రూపొందించారు.

భీమ్ గా తారక్ మరియు రామరాజుగా చరణ్ లు నటించగా.. ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించారు. అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని - రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
Tags:    

Similar News