బాహుబలి ఒక్కటి 11 సినిమాలతో సమానం

Update: 2015-07-02 06:51 GMT
కాలాపానీ, కాంచీవరం, అశోక, హేరామ్‌, ఓం శాంతి ఓం, రా.వన్‌, క్రిష్‌ 3, రోబో.. ఇవన్నీ భారతీయ వెండితెరపై ఆయా కాలాల్లో సంచలనం రేపిన సినిమాలు. ఈ సినిమాలన్నింట్లో అద్భుతమైన ఆర్ట్‌ డైరెక్షన్‌ను మనం చూడొచ్చు. ఆ పనితనమంతా సాబు సిరిల్‌దే. నాలుగు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ప్రతిభ ఆయనది. భారత దేశం గర్వించదగ్గ కళా దర్శకుల్లో ఒకరైన సాబును మన రాజమౌళి తొలిసారి ఓ తెలుగు సినిమాకు పని చేయడానికి ఒప్పించాడు. ఆ సినిమానే బాహుబలి. కోట్లల్లో పారితోషకం తీసుకునే సాబు కోసం దేశవ్యాప్తంగా ఎందరో పెద్ద దర్శకులు ఎదురు చూస్తుంటారు. అలాంటాయన్ని మూడున్నరేళ్లకు పైగా తనతో అట్టిపెట్టేసుకున్నాడు రాజమౌళి.

మరి అంత పెద్ద ఆర్ట్‌ డైరెక్టర్‌ ఓ తెలుగు సినిమాకు ఇన్నాళ్లు పని చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? ఎంత పారితోషకం తీసుకున్నారు? ఈ ప్రశ్నలే సాబు ముందు ఉంచితే.. ''మనలో ఎంత ప్రతిభ ఉన్నా.. దాన్ని బయటికి తెచ్చే సినిమాలు చేతికి వచ్చినపుడే ప్రయోజనముంటుంది. బాహుబలి సినిమా నాకా అవకాశాన్నిస్తుందనే ఈ సినిమా ఒప్పుకున్నా. నాకెంత అనుభవం ఉన్నప్పటికీ బాహుబలికి పని చేయడం సవాలుగానే అనిపించింది. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసినా.. ఇకపై ఎన్ని చేయబోతున్నా.. వాటన్నింట్లోకి బాహుబలి ప్రత్యేకం. నన్నందరూ ఖరీదైన ఆర్ట్‌ డైరెక్టర్‌ అంటారు. కానీ నేను కాంచీవరం సినిమాకు లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్నా. బాహుబలి విషయానికొస్తే.. దీని కోసం ఇప్పటికి మూడున్నరేళ్లు పని చేశాను. రెండో పార్ట్‌ కోసం ఇంకో ఏడాది పాటు పని చేయాల్సి ఉండొచ్చేమో. మామూలుగా నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటా. ఆ లెక్కన బాహుబలి తొలి పార్ట్‌ మాత్రమే నాకు 11 సినిమాలతో సమానం. సమయం ప్రకారం చూస్తే నేను బాహుబలికి చాలా తక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు లెక్క'' అని చెప్పారు సాబు సిరిల్‌.

Tags:    

Similar News