రానా తల ఒక్కటే 28 అడుగులు..

Update: 2015-07-02 11:17 GMT
బాహుబలి ట్రైలర్‌ చూస్తే అందులో ఓ భారీ విగ్రహాన్ని నిలబెట్టే దృశ్యం కనిపిస్తుంది గుర్తుంది కదా. ఆ విగ్రహాన్ని కొంచెం పరిశీలనగా చూస్తే అది భల్లాలదేవుడి క్యారెక్టర్‌దని అర్థమైపోతుంది. రానా పోలికలతో ఆ భారీ విగ్రహాన్ని తయారు చేయించారు. ఐతే దాని భారీ తనం గురించి మాటల్లో వర్ణించలేం. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా అంత భారీ విగ్రహం ఏ సినిమా కోసం తయారు కాలేదంటున్నారు 'బాహుబలి' ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌.

ఆ విగ్రహం కథాకమామిషు గురించి ఆయన వివరిస్తూ.. ''200 మంది నెల రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఆ విగ్రహాన్ని తయారు చేశారు. తల భాగం ఒక్కటే 28 అడుగుల ఎత్తుంటుందంటే మొత్తం విగ్రహం ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖం డిజైన్‌ కోసం త్రీడీ ప్రింటింగ్‌ సాయం తీసుకున్నాం. విగ్రహాన్ని తయారు చేయడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టడం మరో ఎత్తు. వంద అడుగుల ఎత్తున్న ఆ విగ్రహాన్ని 4 భారీ క్రేన్లతో పాటు పెద్ద పెద్ద బుల్డోజర్లను తీసుకొచ్చి నిలబెట్టాం. ఆ విషయంలో పీటర్‌ హెయిన్స్‌ చాలా కష్టపడ్డాడు'' అన్నారు సాబు సిరిల్‌.

బాహుబలి కోసం వేసిన ఇతర సెట్స్‌ గురించి చెబుతూ.. ''మహిష్మతి రాజ్యం, రాజభవనం గురించి రాజమౌళి భారీ ఆలోచనలు చెప్పాడు. ఆయన ఆలోచనలకు తగ్గట్లే సెట్స్‌ వేశాము. నేనిప్పటివరకు ఏ సినిమాకూ ఇంత భారీగా, ఇన్ని సెట్స్‌ వేసింది లేదు. మామూలుగా ఎంత పెద్ద సెట్‌కైనా 24 అడుగుల ఎత్తు, 10/10 వెడల్పుతో పిల్లర్స్‌ వేసి నిర్మాణం చేపడతాం. కానీ మహిష్మతి సెట్‌ కోసం 45 అడుగులు ఎత్తుతో పిల్లర్స్‌ వేసి ఆ తర్వాత సెట్‌ నిర్మించాల్సి వచ్చింది. మేం తయారు చేసిన సెట్టే భారీదంటే దాన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మరింత పెద్దది చేసి చూపించారు. తెరమీద ఆ సెట్స్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు'' అని చెప్పారు సాబుసిరిల్‌. బాహుబలి సినిమా కోసం మొత్తం 20 వేల ఆయుధాల్ని తయారు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.యంత్రాలతో పని చేసే గుర్రాలు, ఏనుగులు, అడవి దున్నలు, పాముల్ని కూడా తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News