బాహుబ‌లి రానా క‌త్తి వెనుక క‌థ చెప్పేశాడు

Update: 2017-12-04 04:33 GMT
సంచ‌ల‌న విజ‌యం సాధించిన బాహుబ‌లి చిత్రానికి సంబంధించిన ముచ్చ‌ట్లు ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తాయి. దాదాపు ఐదేళ్లు త‌ప‌స్సు మాదిరి చేసిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌టం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు క‌ళాద‌ర్శ‌కుడు సాబు సిరిల్‌.  ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన సంద‌ర్భంగా తాను చేసిన‌ బాహుబ‌లితో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు సంబంధించిన చెప్పుకొచ్చారు.

ఆయ‌న చెప్పిన వాటిల్లో బాహుబ‌లి.. రాబో 2.0 చిత్రాల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే..

బాహుబ‌లిలో స్ప‌టిక లింగం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశం కోసం  వాట‌ర్ బాటిల్స్ ఉప‌యోగించి శివ‌లింగాన్ని త‌యారు చేశాం. త‌క్కువ ఖ‌ర్చు కావ‌టంతో పాటు.. చాలా బాగా వ‌చ్చింది. ఇదే చిత్రంలో రానా ర‌థానికి ఉన్న తిరిగే క‌త్తి వెనుక ఒక క‌థ ఉంది. పూర్వంలో పంట‌లు కోయ‌టానికి ఇలాంటి వాటినే వాడేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేశాం.

బాహుబ‌లి మూవీలో నాజ‌ర్‌ కు ఒక చేయి ప‌ని చేయ‌దు. అంగ‌వైక‌ల్యం ఉన్న చేయిలా క‌నిపించే ఒక కృత్రిమ చేయిని అమ‌ర్చాం. అస‌లు చేతిని క‌నిపించ‌కుండా ఉండేందుకు పైన శాలువా లాంటి వ‌స్త్రాన్ని ఉంచాం. అందంగా క‌నిపించే జ‌ల‌పాతం కోసం ఉప్పును వాడాం.

ఐదేళ్ల పాటు బాహుబ‌లి కోసం ప‌ని చేశా. ఉద‌యం నాలుగున్న‌ర‌కు లేచి ప‌ని మొద‌లు పెడితే రాత్రి నిద్ర‌పోయేస‌రికి ప‌ద‌కొండున్న‌ర అయ్యేది. ఈ టైంటేబుల్ క్ర‌మం త‌ప్ప‌కుండా ఐదేళ్లు సాగింది. చాలా సీన్లు చూసిన‌ప్పుడు సీజీ వాడేశార‌ని అనుకుంటారు.కానీ.. చాలా సంద‌ర్భాల్లో అలా జ‌ర‌గ‌దు. అన్ని స‌న్నివేశాల‌కు సీజీ చేయ‌టం సాధ్యం కాదు. అప్పుడే క‌ళాద‌ర్శ‌కుడి అవ‌స‌రం ఉంటుంది.

బాహుబ‌లి మూవీలో వాడిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఫైబ‌ర్ గ్లాస్ తో త‌యారు చేసిన‌వే. బ‌రువు త‌క్కువ‌గా ఉండి వాడ‌టానికి ఈజీగా ఉండేలా రూపొందించాం. ఇక‌.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న రోబో 2.0 సినిమాలో మూడున్న‌ర అడుగులు.. నాలుగున్న‌ర అడుగులు ఉండే రోబోల అవ‌స‌రం ఏర్ప‌డింది. ఓ కంపెనీ వారిని క‌లిస్తే రోబోల త‌యారీకి రూ.5 కోట్లు అవుతుంద‌ని చెప్పారు. దీంతో.. వాట‌ర్ హీట‌ర్ బాడీల‌ను ఉప‌యోగించి రోబోల‌ను త‌యారు చేశాం. ఖ‌ర్చు రూ.5ల‌క్ష‌ల‌తోనే పూర్తి అయ్యింది.
Tags:    

Similar News