ఇక ఇతడిని కాపాడేదెవరు?

Update: 2018-02-10 23:30 GMT
అరంగేట్ర సినిమా ‘రేయ్’ అతీ గతీ లేకుండా పోయి ఇంకా మొదలవకముందే సాయిధరమ్ తేజ్ కెరీర్ అయోమయంలో పడిపోయింది. అలాంటి సమయంలో అల్లు అరవింద్.. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు ముందుకొచ్చి తేజును నిలబెట్టే ప్రయత్నం చేశారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో అతడికి సక్సెస్ అందించారు. దిల్ రాజుకు మెగా మేనల్లుడు నచ్చేసి అతడితో వరుసగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ సినిమాలు నిర్మించాడు. అవి కూడా సక్సెస్ అయి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబోతున్న తర్వాతి స్టార్ అంటూ కితాబులందుకున్నాడు తేజు. కానీ ఇక తర్వాతి స్థాయికి చేరతాడని అనుకుంటుండగా కథ అడ్డం తిరిగింది.

కానీ తిక్క.. విన్నర్.. నక్షత్రం.. లాంటి రాంగ్ సినిమాలు చేశాడు. కెరీర్ గాడి తప్పింది. మళ్లీ దిల్ రాజు లైన్లోకి వచ్చి ‘జవాన్’ ద్వారా తేజును లేపే ప్రయత్నమూ ఫలించలేదు. ‘ఖైదీ నంబర్ 150’తో ఫాంలోకి వచ్చాడు కదా అని వినాయక్ కు అప్పగిస్తే.. అతను ‘ఇంటిలిజెంట్’ అంటూ తన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమా తీసి మెగాస్టార్ మేనల్లుడిని నిలువునా ముంచేశాడు. ఈ సినిమా విషయంలో తేజును అనడానికేమీ లేదు. వినాయక్ పెద్ద దర్శకుడు కదా.. అతను ఎలా చెబితే అలా చేసుకుపోయాడు. తీరా చూస్తే ఈ సినిమా తొలి రోజు తొలి షోతోనే డిజాస్టర్ అని తేలిపోయింది. దీన్ని ఏం చేసినా నిలబెట్టే పరిస్థితి లేదు. దీంతో తేజు కెరీర్ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. తేజుతో తర్వాతి సినిమా తీస్తున్న కరుణాకరన్ మీద ఎలాంటి అంచనాల్లేవు. మరి ఈ స్థితిలో మెగా ఫ్యామిలీ పెద్దోళ్లేమైనా తేజు మీద దృష్టి పెట్టి అతడి కెరీర్ ను నిలబెట్టే ప్రయత్నమేమైనా చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News