మాటలా అవి.. కాదు బుల్లెట్లు

Update: 2015-10-23 03:46 GMT
‘‘నేనంటే నీకు ఇష్టమేనా?’’ అంటుంది హీరోయిన్. ‘‘ఇష్టం కాదు.. ప్రేమ’’ అంటాడు హీరో. ‘‘రెంటికీ తేడా ఏంటోయ్’’ హీరోయిన్ ప్రశ్న. ‘‘గులాబీ పువ్వు మీద ఇష్టం ఉంటే కోస్తాం.. ప్రేమ ఉంటే మొక్కకు నీళ్లు పోస్తాం. అదే ఇష్టానికి ప్రేమకు తేడా’’ ఇదీ జవాబు. ఇదేమీ మాస్ డైలాగ్ కాదు, అందులో పంచ్ ఏమీ లేదు. కానీ మాస్, క్లాస్ తేడా లేదు.. థియేటరంతా మార్మోగిపోయేలా చప్పట్లు. హైదరాబాద్ లో ‘కంచె’ ఆడుతున్న ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో దృశ్యమిది.

సాయిమాధవ్ బుర్రా ఎవరో సీరియల్ రైటరట.. క్రిష్ తీసుకొచ్చి సినిమాకు రాయిస్తున్నాడు.. అని చాలా తేలిగ్గా మాట్లాడుకున్నారు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా విడుదల కాకముందు. కానీ సినిమా చూశాక తెలిసింది అతడి మాటల పదును. ఆ తర్వాత గోపాల గోపాల - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల్లో ఇంకా అద్భుతమైన మాటలు రాసి.. తెలుగు సినిమాపై చెరగని సంతకం వేశాడు సాయిమాధవ్. ఇప్పుడు కంచె సినిమాతో మరో మెట్టు ఎక్కాడు.

ఓ సన్నివేశంలో ఆడవాళ్లను తేలిక చేసి మాట్లాడతాడు విలన్. దానికి షావుకారు జానకి అంటుంది.. ‘‘ఈ మగాళ్లు మన గర్భాన్ని వాడుకుని బతికేస్తారమ్మా’’ అని. ఆ సన్నివేశం చూస్తే అర్థమవుతుంది ఈ మాట ఎంత గొప్పదో. ‘‘పదవి అంటే ఏమనుకున్నావ్ రా.. గొడవల మీద గుత్తాధిపత్యం’’.. ‘‘మనం ఓడిపోతే ఊరు చెడినట్లు.. మనం లేచిపోతే మన ప్రేమ చెడినట్లు’’... ఇలా ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం. మొదట్నుంచి పారిపోదాం పారిపోదాం అనే తోటి సైనికుడు చివరికి ప్రాణాలివ్వడానికి సిద్ధం అన్నపుడు.. ‘‘ఇన్నాళ్లు సైన్యంలో ఉన్నావ్.. ఇప్పుడు సైనికుడివయ్యావ్’’.. అంటూ హీరో చెప్పే మరో డైలాగ్ సాయిమాధవ్ రాసిన మరో గొప్ప మాట. ప్రస్తుత రచయితల్లో సాయిమాధవ్ ఓ ఆణిముత్యం అని చెప్పడానికి ‘కంచె’ మరో రుజువు.
Tags:    

Similar News