మహేశ్ సార్ .. మీ ట్వీట్ మిలియన్ టైమ్స్ చదివాను: సాయిపల్లవి

Update: 2021-09-27 10:30 GMT
మహేశ్ బాబు తన సినిమా పనులను చకచకా పూర్తిచేస్తూనే, కొత్తగా వచ్చిన సినిమాలను కూడా చూస్తూనే ఉంటాడు. ఆ సినిమా తనకి నచ్చితే, అవతలవారిని అభినందించడానికి ఆయన ఎంత మాత్రం సందేహించడు. అలా తాజాగా ఆయన 'లవ్ స్టోరీ' సినిమా చూశాడు. ఆ సినిమా చూడగానే చాలా బాగుందంటూ ట్వీట్ చేశాడు. దర్శకుడిగా శేఖర్ కమ్ముల ప్రతిభా పాటవాలను గురించి ప్రస్తావిస్తూ, ఆ సినిమా చూస్తున్నప్పుడు తనకి కలిగిన ఫీలింగ్స్ ను పంచుకున్నాడు. చైతూ పెర్ఫార్మెన్ గొప్పగా ఉందంటూ ప్రశంసించాడు.

మహేశ్ ట్వీట్ కి శేఖర్ కమ్ముల వెంటనే స్పందించాడు. "ఈ సినిమా మీకు నచ్చిందని చెప్పడం చాలా థ్రిల్లింగా ఉంది .. చాలా సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు .. ఈ సినిమాను చూసిన తరువాత సాయిపల్లవికి ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేశాడు. "ఎప్పటిలానే సెన్సేషనల్ .. అసలు ఈ అమ్మాయికి బోన్స్ ఉన్నాయా? ఇలాంటి డాన్స్ ను ఇంతవరకూ స్క్రీన్ పై చూడలేదు" అంటూ ఒక అద్భుతాన్ని చూశాననే ఉద్దేశంతో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

సాయిపల్లవి కూడా వెంటనే మహేశ్ ట్వీట్ పట్ల స్పందించింది. "మీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ను నేను ఊహించలేదు. మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను. నేను మీ అభిమానిని .. నాలో ఉన్న మీ అభిమాని ఇప్పటికే మిలియన్స్ టైమ్ ఈ ట్వీట్ ను చదివేసింది" అంటూ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసింది. ఇలా 'లవ్ స్టోరీ' సినిమాపై అటు మహేశ్ బాబు చేసిన ట్వీట్లు, ఇటు శేఖర్ కమ్ముల .. సాయిపల్లవి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చేసిన రీ ట్వీట్లు సోషల్ మీడియాలో కావలసినంత సందడి చేస్తున్నాయి.

ఇక మరో వైపున వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారు. చాలా కాలం తరువాత మళ్లీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం కనిపించడం పట్ల చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైతూ నటన .. సాయిపల్లవి నటనతో కూడిన డాన్స్ .. పవన్ సీహెచ్ సంగీతం .. శేఖర్ కమ్ముల అల్లిన కథాకథనాలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News

2026 లోనే SSMB 29!