సింధూ ఆంటీనా సానియా?

Update: 2018-11-30 04:41 GMT
సెల‌బ్రిటీల య‌వ్వారం మ‌హా సిత్రంగా ఉంటుంది. ఒక‌వైపు త‌మ ప్రైవేటు విష‌యాల్ని ప‌బ్లిక్ లో పెట్టేస్తుంటారు. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని ప్ర‌ముఖులు ఉత్సాహంగా త‌మ‌కు సంబంధించిన విష‌యాల్ని పంచుకుంటున్న‌ప్పుడు సాదాసీదా సామాన్యులు స్పందించ‌కుండా ఉంటారా? అందులోకి కాస్తంత స‌ర‌దాగా.. మ‌రికాస్త కొంటెగా వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు మ‌రింత‌గా చెల‌రేగిపోతారు.

త‌మ‌కు తోచిన‌ట్లుగా పోస్టులు పెట్టే  సెల‌బ్రిటీలతో వ‌చ్చే చిక్కేమంటే.. తాము పెట్టిన పోస్టుల‌కు తాము కోరుకున్న‌ట్లు.. త‌మకు న‌చ్చిన‌ట్లుగా రియాక్ష‌న్స్ ఉండాల‌న్న‌ట్లుగా మాట్లాడుతుంటారు. ఓవైపు కెలుకుతూనే.. మ‌రోవైపు త‌మ‌ను అదే ప‌నిగా ట్రోల్ చేస్తున్న‌ట్లుగా వాపోతుంటారు. ఇలాంటి సంద‌ర్భాల్లో త‌ప్పు సెల‌బ్రిటీల‌దే.

మామూలుగా ఉన్న‌ప్పుడు స‌రే.. ఒక్క‌సారి ప్ర‌జాజీవితంలోకి వ‌చ్చినా.. ప్ర‌ముఖుడివైపోయినా.. నిన్న అడిగేసే.. క‌డిగేసే హ‌క్కు మాకు బై డిఫాల్ట్ సంక్ర‌మిస్తుందంటూ అప్పుడెప్పుడో శ్రీ‌శ్రీ తేల్చి చెప్పిన విష‌యాన్ని సెల‌బ్రిటీలు గుర్తు ఉంచుకుంటే సగం స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధును స్పెష‌ల్ గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును ప్ర‌స్తావిస్తే చాలు.. ఎవ‌రికి వారు గంట‌కు పైనే ఆమె గురించి చెప్పేస్తుంటారు. మ‌రి.. ఇలాంటి ఇద్ద‌రు క‌లవ‌టం ఒక విశేష‌మైతే.. తాము క‌లిసిన సంద‌ర్భాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తే..కాస్తంత స‌ర‌దాగా సానియా స్పందించిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఈ మ‌ధ్య‌నే సానియా మాలిక్ దంప‌తుల‌కు పండంటి మ‌గ బిడ్డ పుట్ట‌టం.. ఆ త‌ర్వాత త‌న కొడుకుపై ఉన్న ప్రేమ‌ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంటున్న వైనం తెలిసిందే. సానియాను.. ఆమె గారాల ప‌ట్టిని ప‌లుక‌రించ‌టానికి ప‌లువురు ఆమె ఇంటికి వెళుతున్నారు. ఇందులో భాగంగా పీవీ సింధు వెళ్లారు. ఆమెతో పాటు జేసీ వెళ్లారు.

త‌న‌ను.. త‌న కొడుకును ప‌లుక‌రించ‌టానికి వ‌చ్చిన సింధును ఉద్దేశించి..ఆమెతో దిగిన సెల్ఫీని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన సానియా మీర్జా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. త‌న ఇంటికి వ‌చ్చిన ఆనందాన్ని పంచుకున్న సానియా.. ఇజాన్ ను చూసేందుకు ఇంటికి వ‌చ్చినందుకు థ్యాంక్యూ ఆంటీ సింధూ.. థ్యాంక్యూ ఆంటీ జేసీ అంటూ స‌ర‌దా ట్వీట్ చేశారు. సానియాతో పోలిస్తే వ‌య‌సులో చాలా చిన్న‌దైన సింధును ఆంటీగా సంబోధిస్తూ సానియా చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇలాంటి స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తున్న సానియాపై ఎవ‌రైనా త‌మ‌దైన శైలిలో చెల‌రేగిపోతే.. సానియ‌మ్మ‌కు కోపం రావ‌టం ఖాయం. ఇలాంట‌ప్పుడు.. ఇలాంటి స‌ర‌దా ప్రైవేటు మెసేజ్ ల్ని త‌న‌కు స‌న్నిహితులైన వారితో పంచుకుంటే స‌రిపోతుంది క‌దా? త‌న కొడుకు ట్వీట్ చేసిన‌ట్లుగా సానియా చేసినా.. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు  అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోందని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News