సూప‌ర్ 30 త‌ర‌హాలో మ‌రో ప్ర‌యోగమా?

Update: 2019-09-03 09:52 GMT
వ‌రుస ప్ర‌యోగాల‌తో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు యువ‌ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. కెరీర్ తొలి ప్ర‌య‌త్న‌మే ఘాజీ లాంటి విభిన్న‌మైన కాన్సెప్టుతో జాతీయ స్థాయిలో పాపుల‌ర‌య్యాడు. స‌ముద్రంలో స‌బ్ మెరైన్ నేప‌థ్యం క‌థ‌ను ఎంచుకుని నేటిత‌రం కిడ్స్ లోనూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకున్నాడు. రెండో ప్ర‌య‌త్నం అంత‌రిక్షం అంటూ ఏకంగా స్పేస్ బ్యాక్ డ్రాప్ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అంత‌రిక్షం త‌ర్వాత సంక‌ల్ప్ ఓ బాలీవుడ్ సినిమా తీస్తున్నాన‌ని అప్ప‌ట్లో తెలిపాడు. ఆర్.ఎస్.వి.పి అనే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమా తీస్తుంద‌ని విపుల్ షా బ్యాన‌ర్ కి సంత‌కం చేశాన‌ని .. హిందీలోనే రెండు సినిమాలు తీస్తాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ఆ దిశ‌గానే ప్ర‌య‌త్నిస్తున్నాడా? అంటే... అవున‌నే తెలుస్తోంది. సంక‌ల్ప్ మ‌రోసారి  ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాన్ని ఎంచుకున్నాడ‌ట‌. బీహార్ కి చెందిన ప్ర‌ముఖ గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ వషిష్ట నారాయ‌ణ సింగ్ జీవిత క‌థ‌ను తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సాల్వ్ చేసిన‌ మేథావి. ఆమెరికా శాస్త్ర‌జ్ఞుల‌కే స‌వాల్ విసిరిన మొన‌గాడు అని చెబుతారు. వాళ్లు ఇవ్వ‌లేని సొల్యూష‌న్స్ ఇత‌డు ఇచ్చాడు. ఆల్బర్ట్ ఐన్‌ స్టీన్ ర‌చ‌న‌ల‌కే స‌వాల్ విసిరిన భార‌తీయుడిగా రికార్డుల‌కెక్కాడు.

పేద‌రికంలో పుట్టి.. జీవితంలో దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. చివ‌రికి భార్య వ‌ల్ల మ‌తిస్థిమితం కోల్పోయి రోడ్ల‌పై గ‌డిపాడ‌న్న‌ది హిస్ట‌రీ. అలాంటి గొప్ప వ్య‌క్తి జీవిత‌క‌థ‌ని తెర‌పై చూపించేందుకు సంక‌ల్ప్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది. అదంతా బావుంది కానీ.. ఇటీవ‌లే హృతిక్ రోష‌న్ న‌టించిన `సూప‌ర్ 30` ఈ త‌ర‌హానే. గ‌ణిత శాస్త్ర‌వేత్త ఆనంద్ కుమార్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు. యాధృచ్ఛికమే అయినా అత‌డు కూడా బిహారీనే. ఇంచుమించు సంక‌ల్ప్ ఎంచుకున్న క‌థ‌లానే ఉంటుంది. మ‌రి అలాంట‌ప్పుడు సంక‌ల్ప్ చేసే ప్ర‌య‌త్నం క‌రెక్టేనా? ఒక‌వేళ ఈ ప్ర‌య‌త్నం సూప‌ర్ 30 సీక్వెల్ త‌ర‌హానా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News