అన్ని సింగిల్‌ షెడ్యూల్‌ మూవీసే.. ఆ క్రెడిట్ తారక్‌ అన్నదే

Update: 2021-07-29 14:30 GMT
కరోనా కారణంగా హీరోలు గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు అంటే ఏడాదిన్నర వరకు కనీసం ఒక్కటి రెండు సినిమాలు కూడా చేసింది లేదు. కాని సత్యదేవ్‌ మాత్రం ఈ మహమ్మారి సమయంలోనే ఏకంగా అరడజను సినిమాలు చేసేశాడు. మరికొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. రేపు సత్యదేవ్‌ నటించిన తిమ్మరుసు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్ల ద్వారా వస్తున్న మూవీ ఇదే అవ్వడం విశేషం. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను సత్యదేవ్‌ వ్యక్తం చేస్తున్నాడు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల అవ్వడంతో భారీగా వ్యూస్‌ ను దక్కించుకోవడంతో పాటు మంచి స్పందన కూడా దక్కింది.

తారక్‌ అన్న చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల అవ్వడం వల్ల అంతగా భారీగా వ్యూస్ వచ్చాయి. ఆ క్రెడిట్ అంతా కూడా తారక్‌ అన్నదే అంటూ సత్యదేవ్‌ చెప్పుకొచ్చాడు. తారక్ అన్న చేతుల మీదుగా తమ సినిమా ట్రైలర్ విడుదల చేయడం వల్ల తమ సినిమా స్థాయి పెరిగిందంటూ సత్యదేవ్‌ పేర్కొన్నాడు. ట్రైలర్ విడుదలకు అడగ్గానే ఒప్పుకున్నారు. సినిమా గురించి చాలా సమయం మాట్లాడుకున్నాం. సినిమా కూడా తప్పకుండా థియేటర్‌ లో చూస్తానంటూ హామీ ఇచ్చారు. తారక్‌ అన్న ఈ సినిమా గురించి మాట్లడటం వల్లే ఎక్కువ మందికి సినిమా గురించి తెలిసింది. నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.

ఇక వరుసగా ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా తన ప్రతి సినిమా ను కూడా దాదాపుగా ఒక్క షెడ్యూల్‌ లోనే పూర్తి చేస్తాను అంటూ పేర్కొన్నాడు. తిమ్మరుసు సినిమా ను కూడా కేవలం 39 రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌ లో ముగించినట్లుగా సత్యదేవ్‌ పేర్కొన్నాడు. సినిమా షూటింగ్‌ కు వెళ్లడానికి ముందే పక్కా ప్లానింగ్‌ పక్కా స్క్రిప్ట్‌ తో వెళ్లడం వల్ల ఒక్క షెడ్యూల్‌ లోనే 80 శాతం వరకు షూటింగ్‌ ను ముగించేయవచ్చు. తద్వారా సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

వరుసగా మంచి కథలు నాకు దక్కుతున్నాయని.. అందుకు చాలా సంతోషం అంటూ సత్యదేవ్‌ చెప్పుకొచ్చాడు. నేను చేస్తున్న సినిమాలు అన్ని కూడా తక్కువ రోజుల డేట్లలో పూర్తి చేస్తున్నవే అంటూ సత్యదేవ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా థియేటర్ల ద్వారా బ్యాక్ టు బ్యాక్ రెండు నెలలకు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఈయన నటిస్తున్న సినిమాల్లో గుర్తుందా శీతాకాలం మరియు స్కైలాబ్‌ సినిమాలపై సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. తిమ్మరుసు సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అయితే సత్యదేవ్‌ మరింతగా బిజీ అయ్యే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.

ఏడాదికి అయిదు ఆరు సినిమాలు విడుదల చేయడం అంటే ఖచ్చితంగా మంచి పరిణామం అని.. ఇదే ఒరవడిని అతడు కొనసాగించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో కొందరు ఓటీటీల వైపు చూశారు కాని ఎక్కువ శాతం మంది మాత్రం థియేటర్ల వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్‌ ఎక్స్‌ పీరియన్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ముందు ముందు మళ్లీ థియేటర్లు మునుపటి లాగా రన్‌ అవుతాయనే నమ్మకంను కూడా సత్యదేవ్‌ వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News