పాటసారిగా పరిమళించిన పెద్దాడ మూర్తి

Update: 2023-01-05 12:05 GMT
ఎవరైనా చదువుకునే రోజుల్లో ఏమవుతావు అంటే పోలీస్ అనో కలెక్టర్ అనో హెడ్ మాస్టర్ అనో చెబుతారు. కానీ హై స్కూల్ లో చదువుతున్నపుడే సినిమాలలో  పాటలు రాస్తాను. వేటూరి సుందరరామమూర్తిని అవుతాను అని అనడమంటే అది ఒక్క పెద్దాడ మూర్తికే చెల్లిందేమో. విశాఖ జిల్లా భీమునిపట్నం వాస్తవ్యుడు అయిన పెద్దాడ మూర్తి పూర్తి పేరు పెద్దాడ లక్ష్మీ నరసింహ మూర్తి. చదువులో బాగానే రాణించినా తన లక్ష్యం ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి డిగ్రీ పట్టాలు వద్దనుకున్నాడు.

టీనేజ్ లో ఉండగానే పాటల రచయితగా మారాలని దృడ నిశ్చయం చేసుకున్నాడు. ఆయనకు అలాగే సాహితీమూర్తులు ఉద్ధండపిండాలతో సాన్నిహిత్యం కుదిరింది. ఉత్తరాంధ్రా సాహితీ శిఖరం కాళీ పట్నం రామారావు మాస్టరు గారి స్పూర్తి దొరికింది. అలాగే అక్షర యొధుడు, ప్రఖ్యాత పాత్రికేయుడు పతంజలి వారి వద్ద శిష్యరికం చేసే సౌభాగ్యం కూడా లభించింది.

అలా పెద్దాడ మూర్తి తన గేయ రచయిత కోరికకు బాటలు వేసుకోవడం మొదలెట్టారు. విశాఖ నుంచి పాత్రికేయునిగా ప్రస్థానం మొదలెట్టినా గురి మాత్రం సినీ పరిశ్రమ మీదనే. అందుకె ఎక్కువ రోజులు విశాఖలో పనిచేయలేదు. తన జర్నలిజం గురువు పతంజలితో పాటుగా హైదరాబాద్ వచ్చేశారు. అక్కడ ముందుగా సమయం పత్రికలో పనిచేసారు. ఆ తరువాత ఆంధ్రభూమిలో ఉప సంపాదకునిగా ఉద్యోగం చేస్తూ సినీ పత్రికల వైపుగా దృష్టి సారించి అనేక పత్రికలలో చేరి సూపర్ హిట్ పత్రిక వ్యవస్థాపక పాత్రికేయ బృందంలో సభ్యునిగా మారి కీలకం అయ్యారు.

అలా ఆయనకు సినీ బంధానికి అద్భుతమైన వారధి కుదిరింది. 1995లో పెద్దాడ మూర్తి తొలి పాట కూతురు సినిమాకు రాశారు. అలా మొదలెట్టిన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. పెద్దాడ మూర్తి వేటూరి సుందరరామ మూర్తికి ఏకలవ్య శిష్యుడు. అలా ఆయన టాలీవుడ్ ఎంట్రీతో వేటూరితో పరిచయం పెంచుకుని ఆయనకు నచ్చిన మెచ్చిన శిష్యుడు అయ్యారు. జూనియర్ వేటూరిగా పేరు సంపాదించుకున్నారు.

ప్రతీ పాట వేటూరిలా రాయాలన్న ఆయన తపన దాదాపు మూడు దశాబ్దాల ఆయన సినీ జీవితంలో మంచి పాటలనే అందించింది. వేటూరి సిరివెన్నల శకం సాగుతున్న దశలో పరిశ్రమలో  ప్రవేశించిన పెద్దాడ మూర్తి సినీ పాటను రాయడం ఎలాగో నేర్చుకున్నారు కానీ సినీ రాజకీయాలను మాత్రం అర్ధం  చేసుకోవడంలో విఫలమయ్యారు. 1995 దశకంలో కొత్త నీరుగా వచ్చిన పెద్దాడ మూర్తి ప్రభ ఉధృతంగా సాగుతుంది అని అంతా తలచారు కానీ ఎత్తుల కంటే  పల్లాలనే ఆయన ఎక్కువగా చూశారు.

తనకు తృప్తి లేకపోతే పాట రాయను అని కుండబద్ధలు కొట్టి చెప్పే నైజం పెద్దాడ మూర్తిది. సినీ లౌక్యం తెలియని అమాయకత్వం ఆయనది. తనకు పాట రాయడం ఎలాగో తెలుసు  అన్న ధీమా ఆయనది. అయితే అది గర్వంగా అహంకారంగా బయట చిత్రీకరించబడి మంచి అవకాశాలు ఆయన వద్దకు రాకుండానే జారిపోయాయి. ఆ తరువాత రోజులలో అగ్ర దర్శకులుగా వెలిగిన అనేక మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా మూర్తికి తెలుసు. దాంతో వారిని అదే చనువుతో ఆయన చూసేవారు.

కానీ ముందే చెప్పుకున్నట్లుగా సినీ లౌక్యం తెలియకపోవడం, నిన్నటి చిన్నవాడు నేడు పెద్దవాడు అయ్యాక స్థాయి గౌరవం మారిందని తెలిసి లేని మర్యాదను నటనను తెచ్చుకుని వారిని పొగడడం తెలియకనే పెద్దాడ మూర్తి ఎన్నో హిట్ సినిమాలలో పాటలు రాసే ఛాన్స్ కోల్పోయారు. తెలుగు సాహిత్యాన్ని పూర్తిగా ఔపాసన పట్టిన పెద్దాడ మూర్తికి సినీ పరిశ్రమలో తగినంతగా  అవకాశాలు రాలేదు అన్నది నిర్వివాదాంశం.

ఆయన కంటే వెనక వచ్చిన వారు కూడా గొప్ప రచయితలుగా వెలుగొందడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. మొత్తానికి పెద్దాడ మూర్తి సినీ గీతాన్ని తన ఆశగా శ్వాసగా మార్చుకుని కెరీర్ నత్తనడకంగా సాగుతున్నా అక్కడే ఉండిపోవడమే కాదు, చివరికి ఆర్ధిక ఇబ్బందులు సైతం దిగమింగుకుని ఒక పాటసారిగానే మిగిలిపోయాడు. ఆయన పాండిత్యాన్ని తెలుగు భాష తెలిసిన వారు మెచ్చుకున్నా ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు అన్నది విచారించతగిన విషయం.

అయినా సరే ఏదో రోజుకు తనకు మంచి రోజులు వస్తాయని పెద్దాడ మూర్తి భావిస్తూ చకోర పక్షిగా ఎదురుచూస్తూ వచ్చిన చిన్న చిన్న అవకాశాలతోనే నెట్టుకువస్తున్న క్రమంలో మృత్యువు ఆయన మీద పగపట్టింది. ఎవరు బతికారు మూడు యాభైలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా మూర్తి కూడా  మూడు ఇరవైలు చూడకుండానే అర్ధాయుస్ఖుడిగా అర్ధ శతాబ్ద జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు.

ఏదేమైనప్పటికీ ఒక్క మాట చెప్పుకోవాలి. మూర్తి రాసిన పాటలు రాశి కంటే వాసిలో మిన్న. బుగ్గే మందరమా సిగ్గే సిగారామా అంటూ సాగే పాట  కృష్ణవంశీ చందమామ అయినా అంత్య ప్రాశలతో రాసిన మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ చిత్రంలోని సిగ్గుతో చీ చీ పాట అయినా, ఇడియట్ మూవీలో కన్న తల్లి కొడుకుల ప్రేమకు కూడా అద్భుతమైన భావంతో రాసిన నీవె నీవె నీవె నేనంటా  పాట అయినా జనం నోళ్ళలో అలా ఎప్పటికీ  నానుతూనే ఉంటాయి. అలాగే ఆయన ఎన్నో భక్తి గీతాలు రాశారు. ప్రైవేట్ గీతాలు రాశారు. అవన్నీ శ్రోతల మదిలో సదా మెదులుతూ ఉంటాయి.

చివరిగా మరో మాట. తెలుగు సినిమా సాహిత్యాన్ని ఎంతో మంది కవులు సుసంపన్నం చేశారు. ఇంకా ఎంతో మంది గొప్పవారు రావచ్చు. కానీ నానాటికీ సాహిత్యపు విలువలు పడిపోతున్న తరుణంలో పెద్దాడ మూర్తి లాంటి తెలుగు భాష గురించి పూర్తి సాధికారికత కలిగిన వారు సినీ గేయాన్ని ప్రాణం కంటే మిన్నగా భావించి ప్రేమించే వారు రావడం అంటే ఆలోచించాల్సిందే. పాకుడు రాళ్ళు నవలలో రావూరి భరద్వాజా సినీ తారల జీవితాలను వారి దౌర్భాగ్య పరిస్థితులను వర్ణించారు. ఆయన  సినీ గేయ రచయితల గురించి కూడా రాసి ఉండాలనుకుంటే పెద్దాడ మూర్తి లాంటి వారితోనే మరో పాకుడురాళ్ళు నవలను మొదలెట్టేవారేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News