సల్మాన్-షారుఖ్ కలిసి సినిమా..?

Update: 2016-12-07 17:30 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్ మధ్య వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వృత్తిగతంగానే కాక.. వ్యక్తిగతంగానూ వీళ్లిద్దరి మధ్య వైరం ఉంది. అప్పట్లో ఒక పార్టీలో ఇద్దరూ బాహాబాహీకి కూడా దిగారు. ఐతే ఈ మధ్య విభేదాలన్నీ సమసిపోయినట్లు.. ఇద్దరూ స్నేహితులైపోయినట్లు కనిపిస్తున్నారు. సల్మాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భజరంగి భాయిజాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ని షారుఖే లాంచ్ చేయగా.. తాజాగా షారుఖ్-అనుష్క జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసి.. దాని రిలీజ్ డేట్ కూడా సల్మానే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో కరణ్ అర్జున్.. హమ్ తుమారే హై సనమ్.. కుచ్ కుచ్ హోతా హై లాంటి సినిమాలో షారుఖ్.. సల్మాన్ కలిసి నటించారు. ఐతే ఇద్దరూ సూపర్ స్టార్లుగా ఎదిగాక కలిసి సినిమా చేయలేదు. ఐతే మళ్లీ తమ కాంబినేషన్ తెరపైకి వచ్చే అవకాశముందంటూ తాజాగా ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్న షారుఖ్.. సల్మాన్ ఉమ్మడిగా ప్రకటించారు. ‘‘భవిష్యత్తులో జరగొచ్చేమో. మా దగ్గరకు అలాంటి కథ వస్తే మేం కలిసి నటిస్తాం’’ అని షారుఖ్ అనగా.. ‘‘మేం కలిసి నటించడానికి మంచి అవకాశాలున్నాయి. మేమిద్దరం అందుకు సిద్ధంగా ఉన్నాం. ఓ మంచి కథతో ఎవరైనా రచయిత మా దగ్గరికి వస్తే కచ్చితంగా కలిసి నటిస్తాం’’ అని సల్మాన్ తెలిపాడు. ఇటీవలే స్టార్ స్క్రీన్ పురస్కారాల వేడుకలో షారుఖ్.. సల్మాన్ కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News