ఇంకా ఆసుపత్రిలోనే శౌర్య..? పెళ్లి సమయానికి కోలుకుంటాడా..?

Update: 2022-11-15 09:31 GMT
టాలీవుడ్ యువ హీరో నాగ‌శౌర్య అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనగా.. చిత్రీకరణ సమయంలో ఆయన క‌ళ్లు తిరిగి పడిపోయారు. చికిత్స కోసం వెంటనే దగ్గరలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

అయితే నాగ‌ శౌర్య ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకొంటున్నారు. అతని ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

శౌర్య తన కొత్త సినిమాలో పాత్ర కోసం తీవ్రంగా వర్కౌట్స్ చేస్తూ, పర్ఫెక్ట్ బాడీని రెడీ చేస్తున్నాడు. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో సిక్స్ ప్యాక్ బాడీని చూపించాల్సి ఉండగా.. సోమవారం షూటింగ్ లో వాటిని ప్లాన్ చేశారట. దీని కోసం గత మూడు నాలుగు రోజులుగా లాలాజలం మాత్రమే మింగుతూ కనీసం నీళ్లు కూడా తీసుకోలేదట.

దీంతో నాగ‌శౌర్య సెట్ కి వచ్చినప్పుడే కాస్త అల‌స‌ట‌గా కనిపించారట. ఈ క్రమంలోనే యాక్ష‌న్ సీన్ షూట్ చేయాల్సిన సమయంలో క‌ళ్లు తిరిగి ప‌డిపోయార‌ని.. హుటాహుటిన స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారని స‌న్నిహితులు చెబుతున్నారు.

నాగ శౌర్య‌కు వైర‌ల్ ఫీవ‌ర్ ఎటాక్ అయినట్లు డాక్టర్స్ తెలిపారు. ఇప్ప‌టికీ కాస్త నీర‌సంగానే ఉన్నార‌ని తెలుస్తోంది. గతంలో 'లక్ష్య' సినిమా టైంలోనూ శౌర్య తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. కొన్ని సీక్వెన్స్ లో తన బాడీని ప్రదర్శించడానికి పర్ఫెక్ట్ డైట్ ని ఫాలో అయ్యాడు. అప్పుడు కూడా కొన్ని రోజుల పాటు నీళ్లు తాగకుండా ఉన్నాడు.

ఇకపోతే ఇటీవల 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో ట్రాక్ లోకి వచ్చిన శౌర్య.. ఈ జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇందులో భాగంగా ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసాడు. ఇప్పటికే 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసాడు.

వ్యక్తిగత విషయానికొస్తే.. నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి, నవంబర్ 20న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో శౌర్య వివాహం జ‌ర‌గ‌బోతోందని ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించి వెడ్డింగ్ కార్డుని షేర్ చేసారు.

బెంగుళూరులో గ్రాండ్ గా వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో శౌర్య అస్వస్థతకు గురవ్వడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అప్పటికి యువ హీరో కోలుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారని సన్నిహితులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News