దక్షిణాది భామ శృతి హాసన్ ఇప్పుడు మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుసగా సినిమా చర్చల్లో పాల్గొంటోంది. తెలుగు-తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ ఛైర్ కు చేరువగా ఉన్న సమయంలో ఈ భామ యూరోప్ కు చెందిన మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడడం తెలిసిందే. ఆ తర్వాత శృతి కెరీర్ పై సరిగా దృష్టి పెట్టలేదు.. పర్సనాలిటీని పట్టించుకోలేదు. దీంతో ఈ భామకు ఛాన్సులు తగ్గిపోయాయి.
ఒక సమయంలో అయితే మైకేల్-శృతిల పెళ్లి అంటూ కూడా వార్తలు వచ్చేశాయి. అనౌన్స్ మెంట్ వచ్చేస్తే.. పప్పన్నం పెట్టేందుకు శృతి హాసన్ రెడీ అయిపోయినట్లే అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ శృతి హాసన్ సినిమాలపై దృష్టి పెట్టింది. టాప్ హీరోలతో ఛాన్సులు రాకపోయినా.. మీడియం బడ్జెట్ హీరోలతో సినిమాలకు కూడా ఒప్పుకుంటానని హింట్స్ ఇస్తోంది. కథలను కూడా వింటోంది. ఇదంతా చూసిన తర్వాత ఆమె మైకేల్ కు బ్రేకప్ చెప్పేసింది కాబోలు అనుకున్నారంతా. లవర్ తో విడిపోవడంతో ఆ బాధ నుంచి బైటకు వచ్చేందుకు కెరీర్ పై ఫోకస్ చేసిందని చెప్పుకున్నారు.
కానీ సడెన్ గా ఈ భామ మళ్లీ తన లవర్ తో కలిసి దర్శనం ఇచ్చింది. ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి వీరిద్దరూ లంచ్ ముగించుకుని బైటకు రావడం కెమేరా కంట పడింది. ఆ తర్వాత ఆరా తీస్తే తేలిన విషయం ఏంటంటే.. శృతి తన ప్రేమకు బ్రేకులేమీ వేయలేదు. కాకపోతే.. పెళ్లిని మాత్రం కాసింత పోస్ట్ పోన్ చేయాలని ఫిక్సయిందట.