లైంగిక వేధింపులకు సెలెబ్రిటీలేమీ మినహాయింపు కాదు... సామాన్యుల కన్నా వారికే ఈ వేధింపులు ఎక్కువ కూడా. ఇలాంటి ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పే గాయని.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయీ శ్రీపాద... తనకెదురైన చేదు అనుభవాన్ని... ట్విట్టర్లో పంచుకుంది. తన లాగే అందరూ కూడా వేధింపులపై బయటకు చెప్పాలని కోరింది.
ఆమె ఈ మధ్య ఓ ఈవెంట్ కు వెళ్లింది. అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. తన చుట్టూ మూగిన గుంపులోని ఒక వ్యక్తి... ఆమెను చేతులతో తడిమేందుకు ప్రయత్నించాడు. ఆమె వక్షోజాలను చేతితో పట్టుకునేందుకు ప్రయత్నించాడట. ఆ విషయంపై ఆమె స్పందిస్తూ... ఎంతోమంది ఇలాంటి వేధింపులకు గురవుతారని... కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేరని ట్వీట్ చేసింది. ఆడా..మగా... ఇద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు తమ టీచర్ల చేతిలోనే... అన్నల చేతిలోనే... అంకుల్స్ చేతిలోనే ఇలాంటి వేధింపులకు గురయ్యే ఉంటారని అంది. కానీ అలాంటివి తల్లిదండ్రులకు చెప్పుకోలేక పోతారని చెప్పింది. చెప్పినా ఎవరూ నమ్మరని అంది. ఆడపిల్లలు చెప్పినా కాస్త వింటారేమో కానీ... అబ్బాయిలకు ఆ ఛాన్సు కూడా లేదని అంది. ఇలాంటి బాధితులు ఇప్పటికైనా నోరు విప్పి జరిగిన సంఘటనలను ఇంట్లో వారితో షేర్ చేసుకోవాలని కోరింది.
కొన్ని సందర్భాల్లో మహిళలు కూడా బాధిత మహిళలను అండగా నిలబడడం లేదని... వారు కూడా ఇబ్బంది పెడుతున్నారని అంది. అమ్మాయిలు ఇలాంటి ఘటన గురించి ఇంట్లో చెబితే... ఆ అమ్మాయికి చదువొద్దని... ఇంట్లోనే కూర్చోబెడతారనే భయం కూడా ఉందని అంది. గతంలో ఇలా హీరోయిన్లను ఈవెంట్లలో చుట్టుముట్టి... లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనలు చాలానే జరిగాయి. టాప్ హీరోయిన్లందరూ ఇలాంటి వేధింపుల బారిన పడిన వారే.