సిరివెన్నెల పాటకున్న వాల్యూ అది

Update: 2015-09-18 09:51 GMT
సిరివెన్నెల వారితో ఓ పాట రాయించుకోవడాన్నే పెద్ద ఘనతగా భావిస్తారు చాలామంది దర్శకులు. ఆయన ఎవరికి పడితే వారికి.. ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు రాయరు. అలాంటిది తొలి సినిమాతోనే మొత్తం అన్ని పాటల్నీ సీతారామశాస్త్రితో రాయించుకున్న ఘనుడు డైరెక్టర్ క్రిష్. ‘గమ్యం’ సినిమాకు సిరివెన్నెల పాటలు ఎంత పెద్ద ఆకర్షణగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత వేదం - కృష్ణం వందే జగద్గురుం సినిమాల్లోనూ అద్భుతమైన పాటలు రాశారాయన. ఇప్పుడు కంచె కోసం మరోసారి కలం విదిల్చారు. ఇందులో ఓ పాట కోసమైతే షూటింగే ఆపేయడానికి సిద్ధమయ్యాడట డైరెక్టర్ క్రిష్. ఆ సంగతిని ఆడియో ఫంక్షన్ లో వెల్లడించారు సిరివెన్నెల. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘కంచె సినిమాలో పాటలు రాయడానికి చాలా కష్టపడ్డాను. నవమాసాలు పూర్తయితే తప్ప ప్రసవం జరగదు. గమ్యం సినిమాలో ఎంతవరకు ఎందుకొరకు అనే పాటను ఎనిమిది నెలల పాటు రాశా. అలాగే ‘వేదం’ - ‘కృష్ణంవందేజగద్గురుం’ సినిమాలకు రాసినప్పుడు చాలా సమయం తీసుకున్నా. కంచె సినిమాలో ఆఖరి పాట పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో నాకే తెలియలేదు. అలాంటి సమమయంలో నేను పాట ఇచ్చేవరకు సినిమాను ఆపుకుందాం అని క్రిష్, నిర్మాతలు అన్న తీరు నాపై బాధ్యత పెంచింది. ఒక మనిషి ఎలా ఉండాలో గమ్యం సినిమాతో చెప్పిన క్రిష్.. తర్వాత వేదం - కృష్ణం వందే జగద్గురుం వంటి భిన్నమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు కంచె మరో విలక్షణమైన సినిమా. ఇది చాలా క్లిష్టమైన కథ ఇది. క్రిష్ సులభంగా చెప్పాడు. ఈ సినిమాలో కొన్ని భాగాలను చూపించినప్పుడు ఆశ్చర్యపోయా. మనుషులకు మనుషులకు మధ్య - మనసులకు మనసులకు మధ్య - దేశాలకు దేశాలకు మధ్య ఉన్న అడ్డుకట్టను ‘కంచె’ అనే అర్థంలో చెప్పాడు క్రిష్‌. అతడికి హ్యాట్సాఫ్’’ అన్నారు సిరివెన్నెల.
Tags:    

Similar News