బిగ్ బాస్ 2 షోలో ఈ సారి ప్రవేశపెట్టిన కామన్ మ్యాన్ కేటగిరీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడుపై మొదట్లో వివాదం రేగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నూతన్ ఓ పొలిటీషియన్ అని....త్వరలోనే ఆయన జనసేనలో చేరబోతున్నారని....గతంలో కూడా పలు రాజకీయ పార్టీలలో పనిచేశారని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రెండో వారంలోనే నూతన్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే, తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరోసారి బిగ్‌బాస్ 2 షోలో రీఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా నూతన్ పై ఓ సామాజిక కార్యకర్త సంచలన ఆరోపణలు చేశారు. నూతన్ నాయుడు ఓ పొలిటికల్ లాబీయిస్ట్ అని - ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని తమను రూ.3 కోట్ల వరకు మోసం చేశాడని శివ అనే సామాజిక కార్యకర్త షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా చానెల్ నిర్వహించిన షోలో పాల్గొన్న శివ....నూతన్ ఫోన్ ఆడియో టేపును రిలీజ్ చేశారు. దీంతో, నూతన్ లాబీయింగ్ ఇపుడు చర్చనీయాంశమైంది.
సుజనా చౌదరి - పరకాల ప్రభాకర్ - కీర్తి శేషులు వైఎస్ ఆర్ - బాలకృష్ణ - నారా భువనేశ్వరి తనకు సన్నిహితులని నూతన్ తనకు చెప్పాడని శివ అన్నారు. బాలయ్యను బాలా అని సంబోధిస్తానని, భువనేశ్వరిని... భువనక్క అని పిలుస్తానని తమతో చెప్పి మభ్యపెట్టాడని ఆరోపించారు. తనకున్న పరిచయాలతో ఓ ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని మాయమాటలు చెప్పి తమ సోదరుడి నుంచి రూ. 3 కోట్లు తీసుకున్నాడని శివ ఆరోపించారు. నూతన్ నాయుడు కామన్ మ్యాన్ కాదని - గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడని... పెద్ద కాన్వాయ్ - చుట్టూ మందీ మార్బలంతో ఆయన పర్యటనలుంటాయని చెప్పారు. కామన్ మ్యాన్ కేటగిరీలో నూతన్ ను బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలా ఎంపిక చేశారని శివ ప్రశ్నించారు. ఓ హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి నూతన్ 35 లక్షలు ఖర్చు పెట్టారని...ఆయన ఇంటి ఓనర్ తనతో చెప్పారని శివ ఆరోపించారు.
అయితే, తాను ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో చూడలేదని....తమ సోదరుడితో పాటు బాధితులు వచ్చి....ఆ నూతన్ నాయుడు ఇతడే అని చెప్పారని అన్నారు. ఇప్పటివరకు అతడిని మేదపురెడ్డి నూతన్ కుమార్ అని అనుకున్నానని, అతడే నూతన్ నాయుడు అని తనకు తెలీదని అన్నారు. మెంటర్ టెక్నాలజీస్ పేరుతో నూతన్ నిర్వహించిన ఆఫీస్ అకౌంట్ డీటేల్స్ బయటకు వస్తే నూతన్ గుట్టు రట్టవుతుందని చెప్పారు. రాజకీయంగా పాపులర్ అయ్యేందుకు బిగ్ బాస్ లోకి నూతన్ వచ్చాడని శివ ఆరోపించారు. త్వరలోనే నూతన్ పై కేసు పెడతామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వకుంటే బిగ్‌బాస్ నుంచి బయటకు రప్పిస్తామని హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలపై నూతన్ స్పందించే అవకాశం లేకపోవడంతో...ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తి కరంగా మారింది.