జూన్ లోనూ సౌత్ సినిమాల‌ దండ‌యాత్ర‌!

Update: 2022-05-17 14:30 GMT
బాలీవుడ్ కు సౌత్ సినిమాలు గ‌త కొన్ని నెల‌లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు సౌత్ నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తుండ‌టంతో మ‌న సినిమాల ధాటికి బాలీవుడ్ మూవీస్ విల విల లాడుతున్నాయి. ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మ‌న సినిమాల‌కు పోటీగా నిల‌బ‌డ‌లేక చ‌తికిల బ‌డిపోతోంది. 'బాహుబ‌లి' నుంచే ఈ దాడి మొద‌లైనా గ‌త ఏడాది డిసెంబ‌ర్ నుంచి ఈ దండ‌యాత్ర మ‌రీ ఎక్కువైపోయింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన 'పుష్ప‌' మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండానే భారీ వ‌సూళ్లని సాధించి బాలీవుడ్ స్టార్స్ కు నైట్ మేర్ గా మారింది. ఇక ప్ర‌తీ హిందీ సినిమా ప్రమోష‌న‌ల్ ప్రెస్ మీట్ ల‌లోనూ బాలీవుడ్ మీడియా పుష్ప వ‌సూళ్ల‌ని  ప్ర‌స్తావించ‌డంతో అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డి అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే. 'బ‌చ్చ‌న్ పాండే' సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో ఈ ప‌రిస్థితి అక్ష‌య్ కుమార్ కు ఎదురు కావ‌డం తెలిసిందే.

ఇక ఒక్క 'పుష్ప‌' సాధించిన వ‌సూళ్ల‌పై స్పందించ‌డానికే బాలీవుడ్ స్టార్లు ఇబ్బందిప‌డుతుంటే పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 వ‌సూళ్ల‌ ప్ర‌భంజ‌నం సృష్టించిన బాలీవుడ్ స్టార్స్ ని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టేశాయి. ఇక్క‌డ కేజీఎఫ్ 2 గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఓ డ‌బ్బింగ్ సినిమా బాలీవుడ్ లో 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం, అది కూడా త‌క్కువ టైమ్ లోనే సాధించ‌డం ఇప్ప‌టికి ఓ రికార్డ్. ఇదే మింగుడు ప‌డ‌కుండా వుంటే బాలీవుడ్ లో స్టార్స్ చేసిన సినిమాలు సౌత్ చిత్రాల‌తో పోటీప‌డ‌లేక చ‌తికిల‌ప‌డిపోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి మ‌న చిత్రాలు బాలీవుడ్ పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టం మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. జూన్ లో సౌత్ సినిమాల‌ దండ‌యాత్ర మొద‌లు కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాలు దాడికి రెడీ అవుతున్నాయి. ఇందులో ముందు వ‌రుస‌లో నిలిచిన మూవీ 'మేజ‌ర్‌'. 2008 లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ముంబై తాజ్ ఎటాక్ నేప‌థ్యంలో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ చిత్రానికి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీలో అడివి శేష్ హీరోగా న‌టించాడు. బాలీవుడ్ బామ‌లు స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా, శోభితా ధూలిపాళ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఓరేంజ్ లో వుండ‌టంతో సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తాజ్ హోట‌ల్ పై ఎటాక్ నేప‌థ్యంలో ఓ రియ‌ల్ హీరో క‌థ‌గా రూపొందిన సినిమా కావ‌డంతో యావ‌త్ దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది.  

జూన్ 3న ఈ మూవీని తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదే టైమ్ లో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'విక్ర‌మ్' కూడా విడుద‌ల కాబోతోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హీరో సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ తో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీ కూడా జూన్ 3నే విడుద‌ల కాబోతోంది. కొంత విరామం త‌రువాత క‌మ‌ల్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంతో క‌మ‌ల్ మ‌ళ్లీ త‌న స‌త్తాను చాట‌బోతున్నాడంటూ ఫ్యాన్స్ హ‌డావిడీ చేస్తున్నారు. ఇది హిందీ రిలీజ్ వుంటుందా? అన్న విష‌యంలో ఇంత వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త‌లేదు.

ఇక ఇదే డేట్ న మ‌ల‌యాళ ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్ రాజీవ్ ర‌వి డైరెక్ట్ చేసిన 'తురా ముఖం' విడుద‌ల కాబోతోంది. న‌వీన్ పాల్ హీరోగా న‌టించిన ఈ మూవీ  పై కూడా భారీ అంచ‌నాలే వున్నాయి. దీన్ని ఎన్ని భాష‌ల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది ఇంకా వెల్ల‌డించ‌లేదు. బ‌హుషా ఇది కూడా మూడు నాలుగు భాష‌ల్లో రిలీజ్ అయ్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు నేచుర‌ల్ స్టార్ నాని 'అంటే సుంద‌రానికి' జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మాత్ర‌మే విడుద‌ల కాబోతోంది. ర‌క్షిత్ శెట్టి '777 చార్లీ' పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.
Tags:    

Similar News