స్రవంతి రవికిషోర్.. ఇక సినిమాలు తీయరట

Update: 2016-01-11 05:30 GMT
‘నేను శైలజ’ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాక ఈ వైరాగ్యం ఏంటి అనుకుంటున్నారా? ఐతే స్రవంతి రవికిషోర్ ఉద్దేశం వేరేలెండి. స్రవంతి మూవీస్ బేనర్ నుంచి సినిమాలు వస్తాయట కానీ.. ఇకపై రవికిషోర్ నిర్మాతగా వ్యవహరించరట. ఆయన తనయుడు కృష్ణ చైతన్యకు నిర్మాణ బాధ్యతలు అప్పగించేసి.. తాను ప్రొడక్షన్ కు దూరంగా ఉంటానని చెబుతున్నారు రవికిషోర్.

‘‘శివమ్ సినిమా పెద్ద ఫ్లాపయ్యాక ఇంకో వంద రోజుల్లోపే ‘నేను శైలజ’తో సక్సెస్ అందుకున్నా. ముందు ఈ విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి టైం పడుతుంది. ఐతే మా బేనర్లో తర్వాతి సినిమా కూడా రామ్ - కిషోర్ తిరుమల తోనే ఉంటుంది. కావాల్సినంత టైం తీసుకుని స్క్రిప్టు తయారు చేయమని కిషోర్ కు చెప్పాను. ఐతే ఇకపై నేను సినిమాను నిర్మించను. సమర్పకుడిగా మాత్రమే ఉంటా. రామ్ అన్నయ్య కృష్ణచైతన్య ప్రొఫెషనల్ పైలట్. సినిమాల కోసం కెరీర్ త్యాగం చేసి వచ్చేశాడు. సంస్థలో పని చేశాడు. ఇక అతనే ‘స్రవంతి మూవీస్’ను నడిపిస్తాడు’’ అని రవికిషోర్ చెప్పారు.

‘నేను శైలజ’ సినిమాను థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశానని.. సత్యరాజ్ ను విజయ్ కుమార్ కౌగిలించుకునే సన్నివేశంలో ఓ ప్రేక్షకుడు క్లాప్స్ కొట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని.. ఈ సినిమాకు సంబంధించి ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అని రవికిషోర్ చెప్పారు. ‘నేను శైలజ’ చూశాక అమెరికాలో ఉన్న తన కూతురు.. ఇండియాకు వచ్చాక తనతో కలిసి షాపింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని.. ఈ సినిమా ఆమెకు అంతగా కనెక్టయిందని ఆయన వెల్లడించారు.
Tags:    

Similar News