తెలుగు సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన శ్రీరెడ్డి ఉదంతం అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించడాన్ని ఆసరాగా తీసుకొని జరుగుతున్న లైంగిక వేధింపులపై శ్రీరెడ్డి గళం విప్పింది. ఈ ఎపిసోడ్ లో నిర్మాతలు - దర్శకులు - సినీ ప్రముఖులు - వాళ్ల కుమారులు...ఇలా అన్ని విభాగాలవారిని శ్రీరెడ్డి విజయవంతంగా రంగంలోకి దింపింది. తనకు జరిగిన ఆవేదనను తెలియజేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించకపోతే..నగ్నంగా నిరసన తెలుపుతానని ప్రకటించడమే కాకుండా...నిజంగానే అలాంటి ప్రయత్నం చేసి హల్ చల్ చేసింది. శ్రీ రెడ్డి ఉదంతం రెండు రాష్ర్టాల్లోనూ ప్రకంపనలు సృష్టించిందనే విషయం తెలిసిందే.
ఇటు సినీ పరిశ్రమ అనంతరం రాజకీయ పార్టీలు సైతం ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్న ఈ ఎపిసోడ్ పై తెలంగాణ ప్రభుత్వం అసలేమాత్రం స్పందించకపోవడం గమనార్హం. శ్రీరెడ్డి ఎపిసోడ్ పై ఏపీలో అధికార తెలుగుదేశం - ప్రతిపక్ష వైసీపీ దుమ్మెత్తి పోసుకుంటున్నప్పటికీ...హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సినీ పరిశ్రమ గగ్గోలు పెట్టినప్పటికీ ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - సినీ పరిశ్రమతో సత్సంబంధాలు కలిగి ఉండే మంత్రి కేటీఆర్ సైతం ఏ విషయాలు చర్చించలేదు. దీంతో శ్రీరెడ్డి రచ్చపై కల్వకుంట్ల ఫ్యామిలీ కిమ్మనకుండా ఉండటం వెనుక సినీ పరిశ్రమపై ఉన్న కోపమే కారణమా? అనే చర్చ కూడా తెరమీదకు వస్తోంది.
ఇదిలాఉండగా..శ్రీరెడ్డి మరో సంచలన ప్రకటన చేసింది. గులాబీ దళపతి కేసీఆర్ తన గురువు అని పేర్కొంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆయన లాగే అందరినీ కలుపుకొని పోతానంటూ ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. దీనిపై యథావిధిగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కాగా దాదాపు వారం పాటు కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పడేందుకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నించారు. సినీ ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం పరిశ్రమ వర్గాలతో సమావేశం అయ్యేందుకు ఆయన ముందుకు వచ్చారు.