సొంత క‌థ‌ల్లో స‌త్తా లేక‌నే స్టార్ హీరోల ప‌క్కచూపులు

Update: 2021-08-09 04:33 GMT
మ‌న హీరోలు ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇరుగుపొరుగు క‌థ‌ల‌పై మ‌క్కువ క‌న‌బ‌రుస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్  అగ్ర హీరోలంతా ఇప్పుడు రీమేక్ ల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇరుగుపొరుగున‌ హిట్ట‌యిన  సినిమా క‌థ‌ను తీసుకుని తెలుగులో రీమేక్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటామ‌నే భావ‌న‌లో ఉన్నారు. ఇది ఇప్పుడే కొత్త కాదు కానీ.. ఇటీవ‌లి కాలంలో ఆ ఒర‌వ‌డి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఇంత‌కుముందు స్థానిక ద‌ర్శ‌కుల‌ సొంత క‌థ‌ల‌తోనే  భారీ విజ‌యాలు సాధించిన హీరోలంతా ఇప్పుడు రీమేక్ చిత్రాల‌పైనా ప్ర‌త్యేకించి మ‌క్కువ చూపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే ..

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ అయింది త‌మిళ సినిమా `క‌త్తి` రీమేక్ తోనే. ఆయ‌న ఈ చిత్రాన్ని తెలుగులో `ఖైదీ నంబ‌ర్ 150` టైటిల్ తో రీమేక్ చేసి భారీ స‌క్సెస్ అందుకున్నారు. అటుపై ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ (సైరా న‌ర‌సింహారెడ్డి) మ‌న ర‌చ‌యిత‌లు అందించిన క‌థ‌.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు త‌మిళ - మ‌ల‌యాళ రీమేక్ సినిమా క‌థ‌ల్ని లాక్ చేసారు. మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ సినిమా `లూసీఫ‌ర్` ని చిరు రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే అజిత్ న‌టించిన‌ త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `వేదాళం` ని తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేసి ట్రీట్ ఇవ్వ‌బోతున్నారు. చిరు వ‌రుస‌గా రెండు రీమేక్ లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని సొంత క‌థ‌ల‌తో మెప్పించ‌డం రైట‌ర్ల‌కు..డైరెక్ట‌ర్ల‌కు త‌ల‌కుమించిన భారం. దీంతో ద‌ర్శ‌కులంతా ఇత‌ర భాషా చిత్రాల రీమేక్ ల వెర్ష‌న్ అంటూ అప్రోచ్ అయి ప‌వ‌ర్ స్టార్ ని లాక్ చేస్తున్నారు. ఆయ‌న గ‌త చిత్రం `వ‌కీల్ సాబ్` బాలీవుడ్ చిత్రం `పింక్`కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ త్వ‌ర‌లో న‌టించ‌బోయే సినిమా  కూడా రీమేక్ . మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియం` రీమేక్ లో న‌టిస్తున్నారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ కి సొంత క‌థ‌ల‌పై ఇటీవ‌ల కాలంలో న‌మ్మ‌కం మ‌రింత‌గా  కోల్పోతున్నారు అన‌డానికి ఆయ‌న చేస్తోన్న రీమేక్ చిత్రాల‌ను ఉద‌హ‌రించ‌వ‌చ్చు. ఇటీవ‌లే త‌మిళ సినిమా `అసుర‌న్` ని `నార‌ప్ప` టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అలాగే  `తిమ్మ‌ర‌సు` కూడా క‌న్న‌డ సినిమా  `బీర్బ‌ల్` కు రీమేక్. `ఇష్క్` అనే మ‌ల‌యాళం సినిమా అదే టైటిల్ తో తెలుగులోనూ రీమేక్ అయింది.

యూత్ స్టార్ నితిన్ కూడా  `అంధాధూన్` రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హిందీ వెర్ష‌న్ లో హృతిక్ రోష‌న్ న‌టించారు. దానిని నితిన్ మాస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇంకా ప‌లువురు హీరోలే రీమేక్ ల బాట‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విధానం వ‌ల్ల‌ సొంత క‌థ‌ల్ని కిల్ చేసిన‌ట్లు అవుతుంది. తెలుగు ట్యాలెంట్ ని ప్రోత్స‌హించే వారు త‌క్కువ‌వుతున్న‌ర‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. సొంత క‌థ‌ల్లో స‌త్తా లేక‌పోవ‌డంతోనే అగ్ర హీరోలంతా ఇలా రీమేక్ ల బాట పడుతున్నార‌న్న‌ది కొంద‌రి వాద‌న‌.

టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు రీమేక్ ల ద‌ర్శ‌కుడిగా పాపుల‌ర‌య్యారు. ప‌వ‌న్ తో సుస్వాగ‌తం చిత్రాన్ని ఆయ‌న తెర‌కెక్కించారు. అది త‌మిళ హిట్ చిత్రానికి రీమేక్. ఇటీవ‌లి కాలంలో ఆదిత్య శ్రీ‌రామ్.. శ్రీ‌కాంత్ అడ్డాల రీమేక్ ల బాట‌లోకి వెళ్ల‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా లూసీఫ‌ర్ రీమేక్ తో తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌న్న ప్రయ‌త్నంలో ఉన్నారు. మ‌రోవైపు వంశీ పైడిప‌ల్లి ఒక తెలుగు క‌థ‌తో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ని క్లీన్ బౌల్డ్ చేయ‌డం ఉత్కంఠ రేపుతోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ తో సినిమా కోసం పైడిప‌ల్లి- దిల్ రాజు బృందం స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.
Tags:    

Similar News