రాజశేఖర్ కథనే రానా చేశాడు

Update: 2017-08-07 07:47 GMT
సీనియర్ దర్శకుడు తేజ తన ఫ్లాపుల పరంపరను కొనసాగిస్తూ రెండేళ్ల కిందట ‘హోరాహోరీ’ అనే డిజాస్టర్ సినిమా తీశాడు. దీని తర్వాత ఆయన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అహం’ అనే సినిమా చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై.. రాజశేఖర్-తేజ మధ్య విభేదాల వల్ల ఆ తర్వాత ఆగిపోయినట్లుగా వార్తలొచ్చాయి. కట్ చేస్తే.. రానా హీరోగా తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మొదలుపెట్టాడు. ఈ చిత్రం మొదలైనపుడు పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్.. ట్రైలర్ లాంచ్ అయ్యాక మాత్రం సీన్ మారిపోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

విశేషం ఏంటంటే.. తేజ ‘అహం’ కథనే ‘నేనే రాజు నేనే మంత్రి’గా మార్చాడట. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబే స్వయంగా వెల్లడించాడు. తేజ ఇంతకుముందు రాజశేఖర్ తో ‘అహం’ చేయాలనుకున్న సంగతి ప్రస్తావించకుండా.. ఓ విలన్ కథతో తేజ ‘అహం’ అనే కథను వినిపించాడని.. అది తమకు బాగా నచ్చిందని.. దానికే కొన్ని మార్పులు చేసి ‘నేనే రాజు నేనే మంత్రి’గా మార్చామని సురేష్ బాబు వెల్లడించాడు. మొత్తానికి సినిమా అద్భుతంగా వచ్చిందని.. ‘నాయగన్’.. ‘గాడ్ ఫాదర్’ లాంటి సినిమా ఇదని సురేష్ బాబు చెప్పడం విశేషం. రానాను హీరోగా పరిచయం చేస్తూ.. ‘ఖైదీ’ లాంటి సినిమా తీయాలని తనకు కోరికగా ఉండేదని.. కానీ శేఖర్ కమ్ముల ‘లీడర్’ కథ వినిపించాడని.. ఆ చిత్రాన్ని వెంకటేష్ తో చేయమని సలహా ఇచ్చినప్పటికీ అతను రానాతోనే చేశాడని సురేష్ అన్నాడు. తన కొడుకును పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి తీయడం చాలా సంతోషంగా ఉన్నట్లు సురేష్ తెలిపాడు.
Tags:    

Similar News