16 ఏళ్ల తరువాత సూర్య జోడీగా జ్యోతిక!

Update: 2022-03-19 02:30 GMT
మొదటి నుంచి కూడా సూర్య దారి వేరు .. ఆయన తీరు వేరు. సినిమాల గురించి తప్ప ఆయన మరి దేని గురించి ఎక్కువగా ఆలోచించరు. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. హిట్లు వచ్చినా .. ఫ్లాపులు వచ్చినా వాటినే పట్టుకుని వ్రేలాడుతూ ఆయన కూర్చోలేదు. ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ వెళ్లవలసిందే. ఆడియన్స్ తో .. అభిమానులతో గ్యాప్ రావడానికి ఆయన ఎంతమాత్రం ఒప్పుకోరు. అలా గ్యాప్ వస్తుందని అనిపిస్తే ఆ ప్రాజెక్టును సొంత బ్యానర్ లోకి లాగేస్తారు అంతే.

ఆయన సరసన చాలామంది కథానాయికలు చేస్తూ వచ్చారు .. వాళ్లలో జ్యోతిక కూడా కనిపిస్తుంది. అప్పట్లో ఈ జంటను తెరపై చూసి చూడముచ్చటగా ఉన్నారని చెప్పుకున్నారు. వాళ్లంతా అనుకున్నట్టుగానే వాళ్లిద్దరూ భార్యాభర్తలయ్యారు. సూర్య - జ్యోతిక తెరపై కలిసి కనిపించి 16 ఏళ్లు అయింది. సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక జ్యోతిక రీ ఎంట్రీ తరువాత తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ జంటను మళ్లీ తెరపై చూసే సమయం ఎంతో దూరంలో లేదనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇటీవలే 'ఈటి' సినిమాతో థియేటర్లకి వచ్చిన సూర్య, ఆ తరువాత సినిమాలను వెట్రి మారన్ తోను .. బాలతోను చేస్తున్నారు. సూర్య కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిన 'పితామగన్' హిట్ ఇచ్చింది బాలనే. అందువలన ఆయనతో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సూర్య ఉత్సాహాన్ని చూపుతూనే ఉంటారు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. ఒక పాత్ర సరసన జ్యోతిక కనిపిస్తే .. మరో పాత్ర జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుందని చెబుతున్నారు.

సూర్య సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ వచ్చిందనే ఒక టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది ఈ సినిమాతోనేనన్నమాట. ఇక ద్విపాత్రాభినయం చేయడం సూర్యకి కొట్టిన పిండే. ఇది కూడా సూర్య సొంత బ్యానర్లో చేస్తున్న సినిమానే. బాల దర్శకత్వంలో ఈ సినిమా చేయనుండటం .. చాలా కాలం తరువాత ఈ సినిమాలో సూర్య సరసన జ్యోతిక అలరించనుండటం .. ఈ సినిమాతో కృతి శెట్టిని కోలీవుడ్ కి పరిచయం చేయడం ఈ సినిమా విశేషాలుగా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
Tags:    

Similar News