సైరా మొద‌టి రోజు వ‌సూళ్లు షాకింగే

Update: 2019-10-04 04:32 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ చిత్రం `సైరా- న‌ర‌సింహారెడ్డి`.  భారీ అంచనాల న‌డుమ‌ విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 81 కోట్ల గ్రాస్‌.. 51.88 కోట్ల షేర్ ని వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.  రాయ‌ల‌సీమ రేనాడు ప్రాంతంలో బ్రిటీష్ మూక‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించిన‌ తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా చిరు అస‌మాన న‌ట‌న‌కు అభిమానుల నుంచి ప్ర‌శంస‌లే కాదు.. అంత‌కుమించి అందుతోంది. తెలుగుతో పాటు త‌మిళం- మ‌ల‌యాళం-క‌న్న‌డం- హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రం కావ‌డంతో ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే `సైరా` తొలి రోజు వ‌సూళ్లు అదిరిపోయాయి. ఈ  మూవీ ప్రీమియ‌ర్ షోస్ ని యుఎస్ఏ- యుఏఈలో దాదాపు 500 థియేట‌ర్ల‌లో ఏర్పాటు చేశారు. ఓవ‌ర్సీస్ లో సినిమాపై భారీ క్రేజ్ ఏర్ప‌డ‌టంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే వుంటాయిని మేక‌ర్స్ అంచ‌నా వేశారు. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఓవ‌ర్సీస్ లో ముందురోజు ప్రీమియ‌ర్స్ తో క‌లిసి 13.50 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు చెబుతున్నారు. తొలి ప్రీమియ‌ర్ షో నుంచే పాజిటివ్ గా మౌత్ టాక్ రావ‌డంతో సినిమాపై క్రేజ్ స్కైహైకి చేరింది. దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 52.60 కోట్ల గ్రాస్ ని సాధించిన‌ట్టు చెబుతున్నారు. దీంతో `బాహుబ‌లి-2` త‌రువాత ఆ స్థాయిలో తొలి రోజు వ‌సూళ్లు సాధించిన రెండ‌వ చిత్రంగా `సైరా` రికార్డు సాధించింది. `సాహో` తొలి రోజు వ‌సూళ్ల రికార్డును ఈ సినిమా చెరిపేసింద‌ని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

`సైరా` హిందీ వెర్ష‌న్ ని 1200ల‌కు పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. నార్త్ ఇండియాలో 3.10 కోట్ల‌ గ్రాస్ వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌లో 10.50 కోట్ల గ్రాస్‌.. త‌మిళ‌నాడు 1.1కోట్లు.. కేర‌ళ కోటీ 80ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. అయితే కేర‌ళ‌.. త‌మిళ‌నాడులో ఆశించినంత‌ భారీ స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. `సైరా` ఓవ‌రాల్ గా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 81.40 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేయ‌డంతో ట్రేడ్ పండితుల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో `సైరా` వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.   
Tags:    

Similar News