అనసూయకు మించి అనేసిన తమ్మారెడ్డిని ఏమంటారో?

Update: 2022-09-01 14:30 GMT
టాలీవుడ్ లో బోలోడెన్ని సినిమాలకు కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కొట్టిన తర్వాత కూడా వాటి ఊసే ఉండదు. కొన్ని సినిమాలు అందుకు భిన్నంగా కొబ్బరికాయ సాదాసీదాగా కొట్టేసినా.. గుమ్మడికాయ కొట్టేసే టైంకు మాత్రం అంచనాలు భారీగా పెరిగిపోతాయి. మరికొన్ని సినిమాలు వీటన్నింటికి భిన్నం. కొబ్బరికాయ తర్వాత.. కథా చర్చల్లో ఉన్నప్పటి నుంచి అంచనాలు వేరే లెవల్ లో ఉంటాయి. ఇక.. ఆ మూవీ మొదలై.. గుమ్మడికాయ కొట్టే టైంకు అంచనాలు పీక్స్ కు చేరుకోవటం.. విడుదల వేళకు.. మొత్తం ఆ మూవీ మీదనే మాట్లాడుకుంటారు. ఆ కోవలోకే వస్తుంది విజయ్ దేవరకొండ నటించి.. పూరీ దర్శకత్వం వహించిన 'లైగర్'.

ఇంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి షో పూర్తై అయ్యేసరికి నెగిటివ్ ప్రచారం నిప్పు కంటే వేగంగా వ్యాపించేయటం.. సాయంత్రం అయ్యేసరికి ఈ సినిమా ఆడే థియేటర్లు ఖాళీగా కనిపించిన పరిస్థితి. సరిగ్గా ఇలాంటివేళలోనే.. ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. ఇక.. విజయ్ ను అభిమానించి.. ఆరాధించే వారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. చెలరేగిపోయి.. అనసూయను ఉద్దేశించి నానా మాటలు అనేశారు.

అర్జున్ రెడ్డి వేళలో తమ మధ్య జరిగిన హాట్ డిస్కక్షన్ ను గుర్తుకు తెచ్చేలా అనసూయ.. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటు అవ్వొచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా' అంటూ భారీ పంచ్ వేసేశారు. అర్జున్ రెడ్డి మూవీలో అమ్మను ఉద్దేశించి చేసిన దారుణ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి విజయ్ తేలిగ్గా మాట్లాడటం.. ఆ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. అనసూయ చేసిన వ్యాఖ్యల్లోని వాస్తవాన్ని పక్కన పెట్టేసిన విజయ్ అభిమానులు ఆమె మీద విరుచుకుపడ్డారు.

రాయలేనన్ని బూతులతో.. దారుణమైన కామెంట్స్ తో ఆమెపై విరుచుకుపడ్డారు. అమ్మను అన్నందుకు రియాక్టు అయితే.. ఇంత దారుణంగా మాట్లాడతారా? ఆన్ లైన్ వేధింపుల మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తానని ఆమె చేసిన వ్యాఖ్యలకు మరింతగా రెచ్చిపోయారు. మొత్తంగా ఈ వివాదం ఇలా సాగుతున్న వేళ.. విజయ్ అటిట్యూడ్ ను ప్రశ్నించేలా టాలీవుడ్ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా రియాక్టు అయ్యారు.

సుత్తి లేకుండా సూటిగా మాట్లాడిన ఆయన.. విజయ్ బిహేవియర్ ను తన వ్యాఖ్యలతో తీవ్రంగా తప్పు పట్టేశారు. సినిమా ట్రైలర్ చూసినప్పుడే తనకు సినిమాను చూడాలనిపించేసిందని కుండ బద్ధలు కొట్టేసిన ఆయన.. సినిమా ప్రమోషన్ సందర్భంగా వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయయన్న షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 'నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు. మన యాక్షన్ పైనే ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుంది' అంటూ ఒకింత ఘాటైన వ్యాఖ్యలే చేశారు.

ఆయన వ్యాఖ్యలు మొత్తం విజయ్ తీరును తప్పు పట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చర్చేమంటే.. విజయ్ మాటల్నితప్పు పట్టిన అనసూయను ఉద్దేశించి అంత దారుణంగా.. ఛండాలంగా మాట్లాడిన విజయ్ ఫ్యాన్స్.. ఇప్పుడు తమ్మారెడ్డి విషయంలోనూ అంతేలా రియాక్టు అవుతారా? కాస్త తగ్గుతారా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. తమ్మారెడ్డి వ్యాఖ్యలకు పెద్దగా రియాక్షన్ రాకుంటే మాత్రం ఒకటి స్పష్టమవుతుందని చెప్పాలి. అనసూయ అంటే అమ్మాయి కావటం.. ఆమెను ఎంతేసి మాటలైనా అనేయొచ్చన్న ఉద్దేశమే ఆమెపై విరుచుకుపడటానికి కారణమని చెప్పక తప్పదు. తమ్మారెడ్డి వ్యాఖ్యల యాక్షన్ ను ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News