ఇక్కడ దక్కనిది అక్కడ దక్కేనా?

Update: 2018-11-19 05:33 GMT
నందమూరి వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తారక రత్న ఒకే సారి దాదాపు ఏడు సినిమాలను ప్రారంభించాడు. అప్పట్లో అదో రికార్డు. అయితే తారక రత్న ఆ రికార్డు తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక పోయింది. హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేసిన తారకరత్న విలన్‌ గా కూడా ప్రయత్నించాడు. పేరు మార్చుకుని ఎన్టీఆర్‌ అని కూడా పిలిపించుకున్నాడు. అయినా కూడా తారక రత్నకు సక్సెస్‌ అనేది దక్కలేదు. తారక రత్న కెరీర్‌ ఖతం అనుకుంటున్న సమయంలో తాజాగా అమృత వర్షిణి అనే చిత్రాన్ని ప్రకటించాడు.

తారకరత్న చాలా కాలం తర్వాత ‘అమృత వర్షిణి’ని చేస్తున్నా కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. సినీ ఇండస్ట్రీలో ఆ సినిమాపై శ్రద్దా లేదు. అయినా కూడా అమృత వర్షిణిని చాలా కష్టపడి తారకరత్న చేస్తున్నాడు. ఈ చిత్రంతో కన్నడంలో కూడా తారకరత్న ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగుతో పాటు కన్నడంలో కూడా ఈ చిత్రాన్ని చేస్తున్నాడట. తెలుగులో దక్కని విజయాన్ని కన్నడంలో అయినా సాధించాలనే పట్టుదలతో తారకరత్న ఉన్నట్లుగా తెలుస్తోంది. కన్నడ ప్రేక్షకుల అభిరుచికి ఈ చిత్రం చాలా దగ్గరగా ఉందనే కారణంతోనే ఈ చిత్రాన్ని అక్కడ కూడా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మేఘశ్రీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రానికి శివప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. జెస్సీ గిఫ్ట్‌ సంగీతం అందించబోతున్నాడు. తారక రత్న లుక్స్‌ పరంగా కూడా చాలా మారాడు. ఒక సగటు హీరో లుక్‌ ఆయనలో కనిపించడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే కెరీర్‌ ఆరంభం నుండి కూడా తారకతర్న లుక్‌ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా కెరీర్‌ లో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

Tags:    

Similar News