ప్రేమ ప్రేమ ప్రేమ.. అంటున్న తరుణ్

Update: 2017-05-06 07:28 GMT
పదేళ్ల కిందట టాలీవుడ్లో లవర్ బాయ్ ఎవరు అంటే మరో మాట లేకుండా అందరూ తరుణ్ వైపు చూపించే వాళ్లు. ‘నువ్వే కావాలి’తో మొదలుపెట్టి ప్రియమైన నీకు.. నువ్వు లేక నేను లేను లాంటి లవ్ స్టోరీలతో తరుణ్ ఎంత మంచి పేరు సంపాదించాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అతడి గోల్డెన్ రన్ ముగిసిపోయాక.. హిట్టు కోసం చాలా ఏళ్ల పాటు ప్రయత్నం చేసి చేసి అలసిపోయి.. చివరికి ఇండస్ట్రీకే దూరమైపోయాడు తరుణ్. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత తరుణ్ హీరోగా ఓ సినిమా మొదలై.. ఇప్పుడు విడుదలకు సిద్ధమవువోతంది. అదే.. ఇది నా లవ్ స్టోరీ. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ లాంచ్ కావడం విశేషం.

తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. పూర్తి స్థాయి ప్రేమకథను చేస్తున్నట్లున్నాడు తరుణ్. టీజర్ అంతా ప్రేమ మైకంతోనే నింపేశారు. ఇదొక ట్రాజిక్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. ‘‘నా ప్రేమ ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుందని అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయిని మరిచిపోవడం ఎంత కష్టమో నాకు తెలుసు’’ అనే తరుణ్ డైలాగులతో మొదలవుతుంది ఈ టీజర్. తర్వాత ‘ఐ లవ్ యూ’ అని.. ‘ఐ జస్ట్ లవ్ యూ’ అని అంటాడు తరుణ్. టీజర్ చివర్లో ‘‘డబ్బుకు లక్ష్మికి.. విద్యకు సరస్వతి.. కానీ ప్రేమకు ఎవ్వరూ లేరు’’ అంటూ ఒక పొయెటిక్ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తంగా టీజర్ అంతటా కూడా ‘ప్రేమ’ తప్ప ఇంకేమీ లేదు. టీజర్లో విజువల్స్.. మ్యూజిక్ బాగున్నాయి. హీరోయిన్ ఒవియా ఏమంత ఆకర్షణీయంగా లేదు. తరుణ్ లుక్ కూడా ఏదోలా ఉంది. ఎస్వీ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రమేష్ గోపి దర్శకత్వం వహిస్తున్నాడు.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News