ఆ విషయంలో తేజ గ్రేట్

Update: 2015-09-17 13:30 GMT
వారం పది రోజులుగా టాలీవుడ్ లో పతాక శీర్షికల్ని అలంకరించిన వ్యక్తి డైరెక్టర్ తేజ. తన కొత్త సినిమా ‘హోరాహోరీ’ విడుదలవబోతుండగా ఆయనిచ్చిన ఇంటర్వ్యూ లు సంచలనం రేపాయి. ఐతే సినిమా వాళ్లు గ్రామాల్ని దత్తత తీసుకోవడం గురించి.. సినీ పరిశ్రమ పోకడల గురించి ఆయన హద్దులు దాటి మాట్లాడటమే జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఓ మంచి పనిలోనూ లోపాలు వెతకడం చాలామందికి రుచించలేదు. తనో చెత్త సినిమా తీసి.. మిగతా సినిమాల గురించి విమర్శించడం కూడా జనాలకు ఒళ్లు మండేలా చేసింది. దీంతో వారం రోజులుగా అందరరూ తేజను తిట్టిపోసే పనిలోనే ఉన్నారు. ఐతే తేజ మాట్లాడిన మాటలు కొన్ని అభ్యంతరకరమే కానీ.. ఆయన కొన్ని అర్థవంతమైన మాటలు కూడా మాట్లాడిన సంగతి జనాలు మర్చిపోతున్నారు. చిన్న సినిమా బతకడానికి ఆయన ఎంచుకున్న దారిని ఎవరూ గుర్తించట్లేదు.

‘హోరాహోరీ’ సినిమా డిజాస్టరే కానీ.. ఆ సినిమాకు నష్టం రాలేదన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ ఘనత తేజదే. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేయడమే దీనికి కారణం. కేవలం పాతికమంది యూనిట్ సభ్యులతో సినిమా తీసేశాడు తేజ. కర్ణాటకలో షూటింగ్ చేస్తున్నపుడు ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గించాడు తేజ. ఆ మూడు నెలలు యూనిట్ లో ఎవ్వరికీ కూడా గొప్ప సౌకర్యాలేమీ లేవు. మామూలు గదుల్లోనే బస. తేజ కూడా లగ్జరీ లాడ్జింగ్ ఏమీ తీసుకోలేదు. షూటింగ్ స్పాట్ లో భోజనాల విషయంలోనూ అందరితో కలిసే సాగాడు తేజ. అంత బఫే వ్యవహారం. ప్లేటు తీసుకుని ఎవరైనా క్యూలో నిలబడాల్సిందే. వడ్డించుకుని తినాల్సిందే. అంతే తప్ప ఎవరికీ ప్రత్యేక వసతులేం లేవు. తేజ కూడా అందరితో పాటే సాగాడు. బాయ్ ఎలాంటి భోజనం తిన్నాడో.. ఎలా ప్లేటు పట్టుకుని క్యూలో నిలబడ్డాడో.. తేజ కూడా అంతే. ఈ రోజుల్లో ఓ డైరెక్టర్ ఇంత సింపుల్ గా ఉండటం.. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి ఇలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండొచ్చు కానీ.. తేజ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడు. మాటల విషయంలో పొగరుబోతని గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తన సినిమా షూటింగ్ విషయంలో తేజ అంత సింపుల్ గా మరెవరూ ఉండరంటారు. అది నిజమే.
Tags:    

Similar News