ఎన్టీఆర్ గురించి తేజ మాట

Update: 2019-01-28 06:05 GMT
ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం ఇచ్చిన షాక్ నుంచి క్రిష్ టీం ఇంకా కోలుకున్నట్టు కనిపించడం లేదు. మహానాయకుడు విడుదలను ప్రకటించడం కాని ప్రమోషన్ గురించి వేగం పెంచడం కాని చేస్తున్న దాఖలాలు లేవు. మొన్న రిపబ్లిక్ డేకి ఓ పోస్టర్ వదలడం తప్ప ఏమి చేయలేదు. అదలా ఉంచితే అందరూ బాగానే ఉందన్న సినిమా వసూళ్ళ పరంగా ఇంత దారుణమైన డిజాస్టర్ గా మిగలడం పట్ల ఇప్పటికే లెక్కలేనన్ని విశ్లేషణలు జరిగాయి. అయితే అందరితో అవును అనిపించుకున్న సమాధానమైతే ఇంతవరకు దొరకలేదు.

ఈ టైంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. క్రిష్ కాకుండా స్క్రిప్ట్ ఓకే అయిన దశలో దీనికి ఒప్పుకున్న తేజ దర్శకత్వంలోనే ఇది రూపొంది ఉంటే ఫలితం మారేదా అని. దానికి తోడు ఇప్పుడీ రిజల్ట్ చూసి తేజ రియాక్షన్ ఏమై ఉంటుందా అనే ఆలోచన రావడం కూడా సహజం. దాని సమాధానం చూచాయగా ఇచ్చాడు తేజ.
బెల్లంకొండ సాయి శ్రివినాస్ తో తాను రూపొందిస్తున్న సీత షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ కథానాయకుడు చూడలేకపోయాయని లేకపోతే కామెంట్ చేసే వాడినని చెప్పాడు.

ఇందులో డ్రామా మిస్ అయ్యిందన్న విమర్శకు బదులిస్తూ ఇలాంటివి దర్శకుడి సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటాయని దానికి చాలా మెదడు కావాలని చెప్పాడు. అంటే క్రిష్ తప్పిదం ఉందని అన్నట్టా లేక మరొకటా అనే స్పష్టత ఇవ్వలేదు. సినిమా చూడలేదు అని ఒప్పేసుకున్నాడు కాబట్టి ఇంత కన్నా అడిగే ఛాన్స్ కూడా దక్కలేదు. అయితే తేజ తప్పుకున్నప్పుడు చెప్పిన ఒత్తిడి అనే కారణం నిజంగానే క్రిష్ మీద ప్రభావం చూపినట్టు ఉంది. స్క్రిప్ట్ ఇలాగే ఉండాలని పరిమితులు గీసుకుని తీయాల్సి రావడంతో అవసరమైన ఎమోషన్ డ్రామా మిస్ అయిపోయి ఎన్టీఆర్ పాత పాటల అతుకుల బొంతలా తయారయ్యింది. అందుకే మహానాయకుడు నెమ్మదించినట్టున్నాడు


Tags:    

Similar News