'భీమ్లా నాయక్' నిడివి తగ్గిస్తున్నారా..?

Update: 2021-11-09 11:33 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి అధికారిక రీమేక్. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు (175 నిమిషాలు) ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో రన్ టైం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మలయాళ స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎపిసోడ్స్ ని పెట్టారు. అలానే సినిమా లెంత్ దాదాపు రెండున్నర గంటలు వచ్చేలా స్క్రిప్ట్ రెడీ చేశారట. రన్ టైం తగ్గించడం వల్ల స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. కాకపోతే ఇందులో రానా కంటే పవన్ కళ్యాణ్ పాత్రకు అధిక ప్రాధాన్యత కల్పించారనే సందేహాలు వ్యక్తం అయ్యేలా చేశాయి.

'భీమ్లా నాయక్' అని పవన్ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టారు. అలానే ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు కూడా పవన్ మీద చిత్రీకరించినవే. రానా కు సంబంధించి ఒక టీజర్ మాత్రమే వదిలారు. అది కూడా పవన్ టీజర్ స్థాయిలో లేదనే చెప్పాలి. దీంతో ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ గా కాకుండా.. సింగిల్ హీరో సినిమాగా తీస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, 'భీమ్లా నాయక్' సినిమా పట్టుదల గల పోలీసు అధికారి - మాజీ సైనికాధికారి మధ్య జరిగిన ఇగో క్లాష్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే RRR రాకతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Tags:    

Similar News