హీరోపై చీటింగ్ కేసు పెట్టిన నిర్మాత

Update: 2021-10-28 05:34 GMT
తమిళ స్టార్‌ హీరో శింబు పై మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న శింబు పై ఈసారి తమిళ నిర్మాత మైఖేల్ రాయప్పన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను శింబు మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడు పేజీల ఫిర్యాదు ను చెన్నై నగర పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో శింబు వల్ల తాను పడ్డ ఇబ్బందులను మరియు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల గురించి అతడు వివరించాడు. శింబు తో పాటు ఆయన తల్లి దండ్రులు కూడా తనను మానసికంగా వేదించారంటూ నిర్మాత ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే... 2016 లో శింబు హీరోగా అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ అనే సినిమాను నిర్మాత మైఖేల్ నిర్మించాడు. ఆ సినిమా పూర్తి కాకుండానే విడుదల చేయడం జరిగింది. షూటింగ్‌ పూర్తి కాకుండా విడుదల చేయడం కరెక్ట్‌ కాదని నేను ఎంతగా చెప్పినా కూడా శింబు ఒప్పుకోకుండా నష్టం వస్తే నేను చూసుకుంటా.. మరో సినిమాను చేస్తానంటూ హామీ ఇచ్చి సినిమాను విడుదల అయ్యేలే చేశాడు. అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ సినిమాకు అధిక రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల తర్వాత నష్టం తప్పలేదు. మొత్తంగా 15 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 12 కోట్ల రూపాయలను పంపిణీదారులకు కట్టాల్సి ఉంది. నష్టం పూడ్చడానికి సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చిన శింబు ఆ హామీని నిలుపుకోలేదు.

ఆ సమయంలోనే నిర్మాతల మండలికి వెళ్లాను. ఆ సమయంలో విశాల్ ప్రెసిడెంట్‌ గా ఉన్నాడు. విశాల్‌ ఆధ్వర్యంలో శింబు మా బ్యానర్‌ లో మరో సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాను చేసేందుకు నిరాకరించాడు. కొత్త అధ్యక్షుడు రావడంతో తన హామీని కూడా శింబు మళ్లీ పక్కకు పెట్టాడు. ఆయన తల్లిదండ్రులను అడిగే ప్రయత్నం చేస్తే వారు కూడా శింబుకు మద్దతుగా మాట్లాడారు. వారి నుండి కూడా తాను మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొన్నాను. నన్ను మోసం చేసిన శింబును కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో శింబు స్పందన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News