తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోంది యువతా మేలుకో !

Update: 2021-03-13 14:30 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదిక గా మరోసారి స్పష్టం చేసిన సమయం నుండి ఏపీలో ఆగ్రహ జ్వాలలు అంబరాన్ని అంటుకున్నాయి. ఇప్పటికే కార్మికులు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు..మా కంఠ లో ప్రాణం ఉండగా ప్రైవేటీకరణ కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఈ ఉక్కు ఉద్యమానికి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రం ఈ ఉక్కు ఉద్యమానికి రావాల్సినంత మద్దతు అయితే లభించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు.

ఇదిలా ఉంటే .. ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ , ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి అంటూ నారా రోహిత్ పేస్ బుక్ వేదికగా ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్ట్ ను ఒకసారి చూస్తే .. నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలి. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ! ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి. ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనం. తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు . సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు అండగా నిలబడతా. తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోంది. యువతా..మేలుకో. నీ పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకు. త్యాగధనుల పోరాటఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించు. తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా. త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతా అంటూ అన్నారు.
Tags:    

Similar News