'వాల్తేర్ వీర్రాజు' టైటిల్ సంగతి తేల్చరేం!

Update: 2021-11-14 06:30 GMT
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఏడాదికి ఆయన ఒక సినిమా చేస్తే చాలా గొప్ప విషయం అనుకున్నారు. భారీతనం అనేది చిరంజీవి సినిమా ప్రధమ లక్షణంగా ఉంటుంది కనుక, ఒక సినిమా పూర్తయితేనే తప్ప మరో సినిమా పూర్తి చేయరు గనుక వెయిటింగులో చాలాకాలం ఉండవలసి వస్తుందని భావించారు. 'ఖైదీ నెంబర్ 150' .. 'సైరా' వరకూ అలాంటి వాతావరణమే కనిపించింది. కానీ చిరంజీవి ఒక్కసారిగా తన దూకుడు పెంచేశారు. యంగ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా ఒప్పుకుంటుంటే, ఆయన మాత్రం ఒక్కసారిగా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు.

అలా మెగాస్టార్ సెట్ చేసిన సినిమాల్లో బాబీ సినిమా కూడా ఉంది. బాబీ కొన్ని మాస్ సినిమాలకు కథలను అందించాడు .. మరికొన్ని మాస్ సినిమాలను తెరకెక్కించాడు. అలాగే ఈ సారి చిరంజీవిని కూడా ఆయన పక్కా మాస్ హీరోగానే చూపించనున్నాడు. సముద్రతీర ప్రాంతంలోని ఒక జాలరి గూడెం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. చేపల వేటకి వెళ్లే బోటు .. లంగరు .. తలకు కండువా చుట్టేసి .. బీడీ కాలుస్తూ పక్కా మాస్ లుక్ తో చిరంజీవి పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా టాక్ వచ్చింది. ఇక అప్పటి నుంచి చిరంజీవి 154వ సినిమాగా ప్రచారం జరుగుతున్నా, 'వాల్తేర్ వీర్రాజు' టైటిల్ తోనే జనం చెప్పుకుంటున్నారు.

వేరే టైటిల్ ఏదైనా పరిశీలనలో ఉందో ఏమో తెలియదుగానీ, ప్రస్తుతానికైతే 'వాల్తేర్ వీర్రాజు' టైటిల్ ను హోల్డ్ లో పెట్టారు. కానీ ఇప్పటికే ఈ టైటిల్ చాలావరకూ జనంలోకి వెళ్లిపోయింది. చిరంజీవి మాస్ లుక్ కి కూడా మంచి మార్కులు పడిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అందుకు సంబంధించిన కసరత్తు చకచకా జరుగుతూనే ఉంది.

ప్రస్తుతం చిరంజీవి .. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చేస్తున్నారు. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా షూటింగు చాలా ఫాస్టుగా జరుగుతోంది. ఇక ఆ తరువాత ప్రాజెక్ట్ అయిన 'భోళా శంకర్' సినిమాను కూడా చిరంజీవి పట్టాలెక్కించేశారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా నటించనుండగా .. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. గతంలో తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. అన్నా చెల్లెళ్ల ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మలయాళం నుంచి ఒక రీమేక్ .. తమిళం నుంచి ఒక రీమేక్ చేస్తున్న చిరంజీవి, బాబీతో చేస్తున్న కథ మాత్రం ఇక్కడ పుట్టి పెరిగిందే. మరి ఈ సినిమా టైటిల్ సంగతి ఎప్పుడు తేల్చుతారో.     
Tags:    

Similar News