మన్మధుడికి ఇదే అసలు సవాల్

Update: 2019-08-08 07:35 GMT
రేపు నాగార్జున మన్మథుడు 2 విడుదల కానుంది. అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద క్రేజ్ ఎక్కువ కావడంలో టైటిల్ కీలక పాత్ర పోషించింది. నిజానికి ఇలాంటి కల్ట్ సినిమాల పేర్లను వాడుకోవడంలో చాలా రిస్క్ ఉంటుంది. కారణం పోలిక. దాని లాగే ఉంటుందా లేక దాన్ని మరిపించేలా ఇంకా బెటర్ గా ఉంటుందా అనే అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లో అడుగు పెడతారు. ఆ కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా చాలు పెదవి విరుపులు వచ్చేస్తాయి. అలాంటి కామెంట్స్ రాకుండా చూసుకోవడం కత్తి మీద సవాలే.

ఈ ఒత్తిడి రాహుల్ రవీంద్రన్ మీద ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మన్మథుడు ఆ టైంలో ఎబోవ్ యావరేజ్ అని తర్వాత దానికి కల్ట్ స్టేటస్ దక్కిందని నాగార్జున అంటున్నాడు కానీ అప్పట్లో అది డీసెంట్ గానే కాదు కమర్షియల్ గానూ సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే టీవీలో ఎప్పుడు వేసినా బ్రహ్మానందం పారిస్ కామెడీ మాస్టర్ తనీష్ కౌంటర్స్ సునీల్ లౌడ్ డైలాగ్స్ నాగ్ ఆఫీస్ లో జరిగే ఎపిసోడ్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ట్రాక్ ఒకటా రెండా చెప్పుకోవడానికి చాలా స్పెషల్స్ ఇందులో ఉంటాయి.

మన్మథుడు 2లో వీటికి ధీటైన ట్రీట్మెంట్ ఉంటేనే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే మన్మథుడులోని త్రివిక్రమ్ స్టైల్ అఫ్ రైటింగ్ ని ఆశించకుండా చూస్తే ఇది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి రైటర్ ఆయన కాదు. ఆ స్టాండర్డ్ ను అందుకోవడమూ ఈజీ కాదు. అందుకే రేపు వచ్చే ఫస్ట్ టాక్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద నాగ్ ఫ్యాన్స్ యమా టెన్షన్ గా ఉన్నారు


Tags:    

Similar News