ఇక్కడ తగ్గించి.. అక్కడ పెంచుతారా...?

Update: 2020-10-03 03:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరున్నర నెలలుగా మూతబడిపోయిన థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 నిబంధ‌న‌ల్లో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా థియేట‌ర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. థియేటర్లను తిరిగి తెరిచేటప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. అయితే హాల్ లో సీటింగ్ కెపాసిటీని 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొంది. దీంతో నిబంధ‌నలకు తగ్గట్టు థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడానికి సన్నాహకాలు ప్రారంభిస్తున్నారు. అయినప్పటికీ సీట్ల సామర్థ్యాన్ని సగానికి తగ్గిస్తే థియేటర్స్ కి రెవెన్యూ అంతగా ఉండదేమో అని భయపడుతున్నారని తెలుస్తోంది.

కోవిడ్-19 నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్స్ నిర్వహించాల్సి ఉంటుంది. షో పడిన ప్రతిసారి హాల్ మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులకు శానిటైజర్ మరియు మాస్కులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిబంధనలకు తగ్గట్లు థియేటర్ లో కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంటే ఇదంతా ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్ కి అదనపు ఖర్చుగా భావించవచ్చు. ఇప్పటికే ఆరున్నర నెలలు థియేటర్స్ క్లోజ్ చేసుకోని కూర్చున్నవారికి ఇది అదనపు భారమనే చెప్పాలి. అయితే ఈ భారాన్ని మోయడానికి సినిమా టికెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడటానికి వారు ప్రభుత్వం నుండి కొన్ని మినహాయింపులు కోరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అసోసియేషన్స్ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అక్టోబరు 15 లోపు టికెట్ రేట్స్ పై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News