వేధింపుల‌పై వార్నింగ్ బోర్డ్స్ !

Update: 2019-04-25 06:00 GMT
బ‌ట్ట‌లిప్పితేనే న‌ట‌న నేర్పిస్తాన‌ని అన్నారు ఒక పెద్దాయ‌న‌. ఆయ‌న్ని పోలీసులు లోనేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళా ఆర్టిస్టు క‌నిపించ‌గానే ఏదో ఒక మాట తూల‌డం లేదా మాట‌ జార‌డం .. బూతుగా మాట్లాడ‌డం.. క‌వ్వింత‌గా వెంట‌ప‌డ‌డం వ‌గైరా చేశారో తాట తీయ‌డం గ్యారెంటీ. స‌ద‌రు న‌టీమ‌ణికి న‌చ్చ‌ని ఒక్క మాట మాట్లాడినా మీ ప‌ని అయిపోయిన‌ట్టే. పోలీస్ కేసులు పెట్టి శంక‌ర మాన్యాలు ప‌ట్టించ‌డానికి న‌టీమ‌ణులెవ‌రూ ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌టం లేద‌ట‌. ఇదివ‌ర‌క‌టిలా ఇప్పుడు ప‌ప్పులుడ‌కే సీన్ లేనేలేద‌ని చెబుతున్నారు ఓ సీనియ‌ర్ ఆర్టిస్ట్. ఆయ‌న ఆన్ లొకేష‌న్ చూసిన‌ది చూసిన‌ట్టే అనుభ‌వ పూర్వ‌కంగా చెప్పిన మాట ఇది.

శ్రీ‌రెడ్డి ఉదంతం .. సుచీలీక్స్ ఉదంతాల త‌ర్వాత అస‌లే ర‌చ్చ ర‌చ్చ‌య్యింది. దీనికి తోడు మీటూ ఉద్య‌మంతో చాలా వ‌ర‌కూ వేధింపుల రాయుళ్లు బ‌య‌ప‌డుతున్నారు. దానికి తోడు టాలీవుడ్ లో ప్ర‌త్యేకించి కాష్(CASH) క‌మిటీని ఏర్పాటు చేశారు. అటు కోలీవుడ్ లోనూ విశాల్ - నాజ‌ర్ సార‌థ్యంలో సౌత్ అంత‌టి కోసం ఓ క‌మిటీని వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌మిటీల వ‌ల్ల కొంత‌వ‌ర‌కూ సెక్సువ‌ల్ వేధింపులు త‌గ్గాయ‌ని చెబుతున్నారు.

టాలీవుడ్ లో ఇప్ప‌టికే చాలా మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌తి ఆఫీస్ ద‌గ్గ‌ర ఓ అద‌న‌పు  నోటీస్ బోర్డ్ ద‌ర్శ‌న‌మిస్తోంది.  ప్ర‌ధాన‌ నోటీస్ బోర్డ్ ప‌క్క‌నే రూల్స్ & రెగ్యులేష‌న్స్ .. మ‌హిళ‌ల ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించాలి?  ఎలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు! అనే విష‌యాల‌పైనా.. చ‌ట్టాల‌పై నా అవ‌గాహ‌న క‌ల్పిస్తూ నియ‌మ‌నిబంధ‌న‌ల ప‌త్రాల్ని అంటించారు. ఫిలింఛాంబ‌ర్ .. నిర్మాత‌ల మండ‌లి.. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప‌రిస‌రాల్లో ప్ర‌త్యేకించి ప‌త్రాలు అంటించిన‌ బోర్డులు క‌నిపిస్తున్నాయి... రామానాయుడు స్టూడియోస్.. సార‌థి స్టూడియోస్.. అన్న‌పూర్ణ స్టూడియోస్.. అన్న‌పూర్ణ‌ ఏడెక‌రాల్లో.. ఇత‌ర అన్ని స్టూడియోల్లో ఫ్రేమ్ తో కూడుకున్న‌ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొన్నిచోట్ల మీటూ ఉద్య‌మం ఉధృతి మొద‌ల‌వ్వ‌గానే బోర్డులు పెట్టేశారు. మ‌రికొన్ని చోట్ల కాష్ టీమ్ యాక్టివ్ అయ్యాక పెట్టారు. ఇటీవ‌లే ఫిలింఛాంబ‌ర్ లో దీని గురించి విస్త్ర‌త‌మైన డిస్క‌ష‌న్ సాగింది. అనంత‌రం కాష్ టీమ్ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ టీమ్ లో ఇండ‌స్ట్రీకి చెందిన వాళ్లు 50 శాతం.. ప‌రిశ్ర‌మ వెలుపలి వాళ్లు 50శాతం ఉండి ప్ర‌తిదీ రివ్యూ చేస్తున్నార‌ట‌. ఉద్యోగ‌/  సినిమా ఉపాధి కోసం వ‌చ్చిన మ‌హిళ‌ల్ని వేధిస్తే ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ సెక్ష‌న్ 294, 354, 509 ప్ర‌కారం క్రిమిన‌ల్ కేసులు పెడ‌తారు. స్త్రీల విష‌యంలో అశ్లీల‌మైన చూపు.. అశ్లీల‌మైన మాట‌.. అశ్లీల‌మైన ఎలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డినా అంతే సంగ‌తి. అలాంటి వారికి ఇండ‌స్ట్రీ బ‌హిష్క‌ర‌ణ‌తో పాటు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు. కాస్టింగ్ సెల‌క్ష‌న్ పేరుతో అశ్లీల ఫోటోలు అడ‌గ‌డం చేసినా.. లేదా ఇచ్చినా (కాస్టింగ్ డైరెక్ట‌ర్లు) వారికి శిక్ష త‌ప్ప‌దు. ఉపాధి కోసం వ‌చ్చిన వారిపై లైంగిక వాంఛ‌లు తీర్చుకోవాల‌నుకోవ‌డం శిక్షార్హమైన నేరం. complaints@telugufilmchamber.in // complaints@apfilmchamber.com మెయిల్స్ కి ఆర్టిస్టులు ఫిర్యాదులు పంప‌వ‌చ్చు.
    

Tags:    

Similar News