టాలీవుడ్ ఇప్పుడు కంటెంట్ కి ప‌వ‌ర్ హౌస్‌

Update: 2022-05-18 13:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఏ ముహూర్తాన `బాహుబ‌లి`ని స్టార్ట్ చేశాడో కానీ అదే ఇప్ప‌డు టాలీవుడ్ కీర్తిని దేశ వ్యాప్తంగా ప‌తాక స్థాయిలో రెప‌రెప‌లాడించేస్తోంది. ప్ర‌స్తుతం ఏ నోట విన్నా.. ఏ సెల‌బ్రిటీ చ‌ర్చ‌లో అయినా టాలీవుడ్ ప్ర‌ధ‌మంగా వినిపిస్తోంది. హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఒక‌ప్పుడు అన్న‌పూర్ణ వారి స్వ‌ర్ణ‌యుగం అని అన్నారు. అప్ప‌ట్లో తెలుగు సినిమా మూడు పువ్వులు ఆరు కాయ‌లు అనే స్థాయిలో వ‌ర్థిల్లింది. మ‌ళ్లీ ఇన్నాళ్లు ఆ ఫేజ్ కి మించిన వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క‌నిపిస్తోంది.

గ‌త ఏడాది `పుష్ప‌`తో భారీ విజ‌యం ల‌భించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఆ త‌రువాత ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ దేశ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించ‌డంతో మ‌న వాళ్లు కొత్త క‌థ‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టిపెట్ట‌డం మొద‌లు పెట్టారు. ఇక ఎవ‌రిని ట‌చ్ చేసినా మినిమ‌మ్ గ్యారెంటీ హీరోలు కూడా పాన్ ఇండియా టార్గెట్ అంటూ పాన్ ఇండియా సినిమాల వైపు ప‌రుగులు తీస్తున్నారు. ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

టాప్ డైరెక్ట‌ర్స్ కూడా రాజ‌మౌళి బాట‌లోనే పాన్ ఇండియా సినిమాల‌కు రెడీ అవుతున్నారు. చాలా మంది హీరోలు, యంగ్ డైరెక్ట‌ర్ లు ఇప్ప‌టికే పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌న వాళ్ల‌లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఇండియా యావ‌త్తు టాలీవుడ్ వంక చూస్తున్న నేప‌థ్యంలో కొత్త క‌థ‌ల్ని ఎంచుకుని స‌రికొత్త చిత్రాల‌ని అందించి తాము కూడా రేసులో వున్నామ‌నే సంకేతాల్ని అందించాల‌ని ప్ర‌తీ స్టార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

అంతే కాకుండా యూనివ‌ర్స‌ల్ అప్పీల్ వున్న‌ప క‌థ‌ల‌తో అత్య‌ధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్ప‌టికే పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ అంత‌కు మించిర క‌థ‌ల‌తో ఆక‌ట్టుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. క‌థ‌ల విష‌యంలోనూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటూ రైట‌ర్స్ ని పాన్ ఇండియా రేంజి క‌థ‌ల‌తో మాత్ర‌మే త‌మ వ‌ద్దకు ర‌మ్మంటున్నారు. అయితే ప్ర‌తీదీ పాన్ ఇండియా స్థాయిలో సెట్ చేయాలంటే అంత ఈజీ కాద‌న్న‌ది తెలిసిందే. అయినా స‌రే క‌థ‌ల విష‌యంలో మాత్రం మ‌న వాళ్లు గ‌తంలో లాగా రాజీప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతే కాకుండా మ‌న వాళ్లలో మ‌రో మార్పు కూడా మొద‌లైంది. క‌థ డిమాండ్ మేర‌కు కీల‌క పాత్ర‌ల కోసం క్రేజీ స్టార్ల‌ని కూడా తెర‌పైకి తీసుకొస్తున్నారు. త‌న పాత్ర‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త వుండాల‌న్న థోర‌ణి పోయి క‌థ డిమాండ్ మేర‌కు ఏది చేయ‌డానికైనా, ఎలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికైనా మ‌న హీరోలు వెన‌కాడ‌టం లేదు. అంటే కాకుండా డీ గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనూ క‌నిపించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇందుకు `పుష్ప‌`, `ద‌స‌రా` సినిమాల‌నే ఎక్జాంపుల్ గా చూడొచ్చు. పుష్ప‌లో బ‌న్నీ ఊర మాస్ పాత్ర‌లో డీ గ్లామ‌ర్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం సెట్స్ పై వున్న `ద‌స‌రా` మూవీలో నేచుర‌ల్ స్టార్ నాని ప‌క్క‌గా మాసీవ్ అవ‌తార్ లో డీ గ్లామ‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. ఈ కోవ‌లోనే మ‌రి కొన్ని పాన్ ఇండియా మూవీస్ త్వ‌ర‌లో రాబోతున్నాయి. మ‌న వాళ్లో వ‌చ్చిన ఈ మార్పు టాలీవుడ్ ని కంటెంట్ కి ప‌వ‌ర్ హౌస్ గా మార్చేస్తోంది. ఇత‌ర భాష‌ల్లో ఈ రేంజి సినిమాలు లేక‌పోవ‌డం, మ‌న నుంచే బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాలు వ‌స్తుండ‌టం. రాజ‌మౌళి - మ‌హేష్ ల సినిమా, ఎన్టీఆర్ - కొర‌టాల సినిమా, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాలు త్వ‌ర‌లో సెట్స్ పైకి రాబోతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం ఇప్ప‌డు టాలీవుడ్ వైపు చూస్తోంది. అయితే దీన్ని మ‌న వాళ్లు ఎంత కాలం కాపాడుతారు?.. దీన్ని ఏ స్థాయికి తీసుకెళ‌తార‌న్న‌దే ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News