గట్టి చర్యలకు సిద్ధం అవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!!

Update: 2020-04-27 02:30 GMT
సినిమా రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రభావం రెండు నెలలతో ఆగిపోయే అవకాశం లేదని.. కనీసం రెండేళ్ల వరకు దీని ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ నిర్మాతలు.. దర్శకులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లు మూతపడడం.. షూటింగులు ఆగిపోవడం.. కొత్త సినిమా విడుదల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో నిర్మాతలు తమలో తాము చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎటువంటి చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమ మళ్లీ కుదుటపడుతుంది అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.

సురేష్ బాబు.. అల్లు అరవింద్.. దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాతలు ఇప్పటికే సినిమా బడ్జెట్లను తగ్గించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో నిర్మాతలను ఆదుకునేందుకు నటీనటులు.. డైరెక్టర్లు అందరూ తమ పారితోషికం తగ్గించుకోవాలని అంటున్నారు.  ఎగ్జిబిషన్ రంగం సంక్షోభాన్ని ఎదుర్కోకొనడం తప్పదని తేలిపోవడంతో  బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు భారీగా అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి లేదని.. గతంలో మాదిరిగా పోటీలుపడి రికార్డు రేట్లకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయరని అంటున్నారు. అందుకే ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసి టాలీవుడ్ లో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఖరారు చేస్తారట.

కొంతమంది నిర్మాతలు ఇప్పటికే తమ సినిమాల బడ్జెట్లను తగ్గించుకోవాలని.. హీరో హీరోయిన్లకు.. ప్రధాన టెక్నీషియన్లకు పారితోషికం బదులుగా లాభాల్లో వాటా ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయాలపై ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారని.. లాక్ డౌన్ విరమణ తర్వాత ఛాంబర్ లో ఒకసారి కూర్చుని మళ్లీ చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తారని అంటున్నారు.  హీరో ఎవరైనా హీరోయిన్ ఎవరైనా ఈ రూల్స్ కు ఒప్పుకోక తప్పేలా లేదు ఎందుకంటే.. థియేటర్ల నుండి వచ్చే కలెక్షన్స్ గండి పడినప్పుడు నిర్మాతలైనా ఏం చేయగలరు?




Tags:    

Similar News