కామెంట్: ట్రైలర్ అనే కత్తితో జాగ్రత్తయ్యా

Update: 2017-10-25 17:23 GMT
ఒక సినిమాను అందరికి నచ్చేలా తియ్యాలని ప్రతి ఒక్క దర్శక నిర్మాతలు అనుకుంటారు ఏ మాత్రం తగ్గకుండా కోట్లలలో డబ్బును దారబోస్తారు. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే ఈ రోజుల్లో బడ్జెట్ 100 కోట్లు దాటాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేయి. కానీ సౌత్ మార్కెట్ కూడా బాగా పెరగడంతో నిర్మాతలు సినిమాను కాస్ట్లీ గా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలైతే దర్శకులను నమ్మి బడ్జెట్ టార్గెట్ ను అనుకున్న దానికంటే ఎక్కువనే పెంచేస్తున్నారు.

సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా థియేటర్స్ లోకి అడుగు పెట్టేంత వరకు నిర్మాతలు డబ్బు పెట్టాల్సింది. మరి అంత పెట్టుబడి పెట్టిన సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే కూడా ప్రమోషన్స్ చాలా అవసరం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం ట్రైలర్. అవును ఈ రోజుల్లో ట్రైలర్ ఒక్కటే సినిమా లాభాలను అందించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. మొదటి రోజు సినిమాకు గట్టి ఓపెనింగ్స్ రావాలంటే సినిమా ట్రైలర్ దుమ్ము లేపాల్సిందే. అందుకే కొత్త మంది దర్శక నిర్మాతలు ట్రైలర్ కోసం ప్రత్యేకంగా కొన్ని షాట్స్ ని షూట్ చేస్తున్నారు. సినిమా రిజల్ట్ తర్వాత సంగతి. ఫస్ట్ సినిమాకు క్రేజ్ తేవాలి అది చాలా ముఖ్యం. అదే విధంగా టీజర్స్ కూడా బోనస్ లాంటి క్రేజ్ ని ఇస్తున్నాయి.  కానీ కొంత మంది టాప్ హీరోల ట్రైలర్లు లు మాత్రం ప్రేక్షకుడిని చాలా మోసం చేస్తున్నాయాని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల వచ్చిన మహేష్ - స్పైడర్ సినిమా విడుదలకు ముందు ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టీజర్ తో చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ట్రైలర్ తో అయితే చాలా వరకు క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ సినిమాలో మాత్రం ట్రైలర్ లో ఉన్నవి మాత్రమే ఉన్నాయనే విధంగా కామెంట్స్ వినిపించాయి. ప్రేక్షకుడు పెట్టుకున్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ సక్సెస్ చేయలేకపోయింది. ఇక డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా కూడా పరిస్థితి అదే. ట్రైలర్ లో బన్నీ కొత్తగా కనిపిస్తున్నాడు కదా అని థియేటర్స్ కి వెళితే తెరపై రొటీన్ ఫార్మాట్ కనిపించింది. కానీ ట్రైలర్ వల్ల ఆ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇదే తరహాలో కాటమరాయుడు కూడా ట్రైలర్ తో ఆకర్షించి మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేదు.

సినిమా కాన్సెప్ట్ అర్ధం కాకూండా.. ఎదో ఉంది అనేలా రెండు నిమిషాల ట్రైలర్ తో ప్రేక్షకులని ఆకర్షించాలంటే కష్టమే అని చెప్పాలి. కానీ దర్శకులు ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం అంతగా ట్రైలర్ వల్ల ఉపయోగం ఏమి ఉండదని, కేవలం కథనే అసలు హీరో అంటున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా అదే అంటున్నాడు. అప్పట్లో తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ట్రైలర్ చాలా సింపుల్ గా ఉండేది పైగా అందరికీ నచ్చలేదు.. అయినా కూడా సినిమా మంచి సక్సెస్ అయ్యిందని చెప్పాడు. అయితే ఆయన బాలయ్యతో తీసిన పైసా వసూల్ ట్రైలర్ మాత్రం బాగానే వచ్చింది. సినిమా మాత్రం మొదటి వారానికే మాయమైంది. అది నా చేతుల్లో లేని రిజల్ట్ అనేశాడు పూరి.

ఇక నితిన్ లై కూడా భారీ అంచనాలను రేపింది. కాని సినిమా ప్రేక్షకుడి అర్ధం కాకపోవడంతో నిర్మాత కు భారీ నష్టాలని మిగిల్చింది. చివరగా సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకుడి ని రప్పించడానికి మాత్రం ఈ రోజుల్లో ట్రైలర్ కి అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే.  అయితే ఈ ట్రైలర్ కు పదును ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ చేసినా నష్టమే.. తక్కువగా చేసినా నష్టమే. చివరకు ఆ పదునైన కత్తి సినిమాను కోసేస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమీ!!
Tags:    

Similar News